బాలీవుడ్ టాప్ స్టార్లలో ఒకడు రణబీర్ కపూర్. 2018లో విడుదలైన అతడి చివరి సినిమా ‘సంజు’ అప్పట్లోనే రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఖాన్ త్రయానికి దీటైన స్టార్‌గా రణబీర్ అవతరించాడు ఆ చిత్రంతో. ఆ సినిమా ఫలితం చూసే రణబీర్‌తో షంషేరా, బ్రహ్మాస్త్ర లాంటి భారీ చిత్రాలు లైన్లో పెట్టారు దర్శక నిర్మాతలు.
‘షంషేరా’ ట్రైలర్ చూస్తే అందులోని భారీతనం అర్థమవుతుంది. ‘బాహుబలి’తో దానికి పోలికలు కనిపించాయి. యశ్ రాజ్ ఫిలిమ్స్ లాంటి అగ్ర నిర్మాణ సంస్థ రూ.150 కోట్ల బడ్జెట్లో తీసిన సినిమా ఇది. కరణ్ మల్హోత్రా దర్శకుడు. కొవిడ్ కారణంగా ఈ చిత్ర మేకింగ్, రిలీజ్ ఆలస్యమై.. ఎట్టకేలకు ఈ శుక్రవారం ‘షంషేరా’ థియేటర్లలోకి దిగింది. కానీ ఈ చిత్రానికి టాక్, ఓపెనింగ్స్ ఏమాత్రం ఆశాజనకంగా లేవు. బాలీవుడ్లో మరో పెద్ద డిజాస్టర్‌గా ‘షంషేరా’ నిలవబోతుందనే సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి.
నార్త్ ఇండియాలో ‘షంషేరా’కు ఉదయం 7 గంటలకే షోలు పడ్డాయి. దీంతో ఉదయం 10 గంటలకే టాక్ బయటికి వచ్చేసింది. ఇటు క్రిటిక్స్, అటు ప్రేక్షకులు సినిమా గురించి పూర్తి నెగెటివ్‌గా స్పందిస్తున్నారు. ఒక క్రిటిక్ అయితే గత పదేళ్లలో ఇంత బోరింగ్ సినిమా ఇంకోటి రాలేదని.. ఇదొక టార్చర్ మూవీ అని ట్విట్టర్ పోస్ట్ పెట్టాడు. చాలామంది క్రిటిక్స్ నెగెటివ్ రివ్యూలే ఇస్తున్నారు.
ఇక సామాన్య ప్రేక్షకుల నుంచి ఫీడ్ బ్యాక్ కూడా చాలా బ్యాడ్‌గా ఉంది. సినిమా డిజాస్టర్ అని అందరూ తీర్మానించినట్లే ఉన్నారు. ‘బాహుబలి’ని అనుకరించే ప్రయత్నంలో కరణ్ మల్హోత్రా తుస్సుమనిపించాడని.. రణబీర్ పెర్ఫామెన్స్ మినహాయిస్తే సినిమాలో ఏదీ ఆకట్టుకోలేదని అంటున్నారు.
కొవిడ్ తర్వాత బాలీవుడ్ మార్కెట్ ఎంతగా దెబ్బ తిందో తెలిసిందే. పెద్ద పెద్ద సినిమాలకు కూడా ఓపెనింగ్స్ దారుణంగా వస్తున్నాయి. పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఫలితం లేకపోతోంది. అలాంటిది బ్యాడ్ టాక్‌తో మొదలైన ‘షంషేరా’ పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పాల్సిన పని లేదు.
ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్స్ అంతంతమాత్రం కాగా.. తొలి రోజు బ్యాడ్ టాక్ రావడం, వర్షాల ప్రభావంతో పరిస్థితి ఘోరంగా ఉంది. రణబీర్ సినిమాకు ప్రేక్షకులు లేక షోలు క్యాన్సిల్ చేయాల్సిన పరిస్థితి తలెత్తిందంటే సినిమా ఫలితం ఎలా ఉండబోతోందో అర్థం చేసుకోవచ్చు.