రౌడీ హీరో లాజిక్ మిస్సయ్యాడు

ఈ రోజు సుదర్శన్ థియేటర్ వేదికగా జరిగిన ట్రైలర్ లాంచ్ లో విజయ్ దేవరకొండ చేసిన కొన్ని కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. తన గత సినిమా సరిగా ఆడకపోయినా, నా తాత తండ్రి మీకు తెలియకపోయినా ఇంత ప్రేమ నా మీద చూపిస్తున్నారని మైకు ముందు ఊగిపోయేలా చెప్పాడు. నిజానికి ఈ కామెంట్ తెలుగు ఇండస్ట్రీలో వారసత్వం మీద ఇన్ డైరెక్ట్ కౌంటరని, అసలు ఆ ప్రస్తావన తేకుండా మాములుగా కూడా మాట్లాడొచ్చని, కావాలనే అన్నాడని సోషల్ మీడియా నెటిజెన్లు రివర్స్ కౌంటర్లు ఇవ్వడం మొదలుపెట్టారు.

ఇక్కడ విజయ్ ఒక లాజిక్ మిస్ అయ్యాడు. ఒక హీరోకు స్టార్ డం వచ్చాక అతని కుటుంబ సభ్యులు దాన్ని వాడుకుని పరిశ్రమలో సెటిలవ్వడం అన్ని భాషల్లో ఉన్నదే. ఎవరి దాకో ఎందుకు. ఆనంద్ దేవరకొండ తన తమ్ముడు కాకపోతే ఏ నిర్మాత ముందుకు వచ్చేవాడు. డెబ్యూ మూవీలో సోసో పెర్ఫార్మన్స్ ఇచ్చినా తర్వాతి సినిమాలు ఎలా వచ్చాయి. ఇప్పటికీ చేతిలో బ్లాక్ బస్టర్ లేకపోయినా కేవలం దేవరకొండ తమ్ముడనే స్టాంప్ తోనే చేతిలో మూడు నాలుగు ప్రాజెక్టులతో యమా బిజీగా ఉన్నాడు. ఇది వాస్తవమేగా.

అలాంటప్పుడు తాతలు తండ్రుల మాటలు అవసరమే లేదు. ఆ మాటకొస్తే చిరంజీవి,రవితేజ, రజినీకాంత్ వీళ్లంతా దశాబ్దాల తరబడి ఏలుతున్నారంటే దానికర్థం వాళ్ళ పూర్వికులు ఆడియన్స్ కి తెలుసని కాదుగా. డిజాస్టర్లు వచ్చినా హిట్లు కొట్టినా అభిమానం విషయంలో ఫ్యాన్స్ ఒకేలా ఉంటారు. ఇప్పుడు విజయ్ దేవరకొండకూ అంతే. అయినా ఉద్వేగంలో అంత పెద్ద మాస్ క్రౌడ్ ని ఒకేసారి థియేటర్ లోపల బయటా చూసేసరికి అలా అన్నాడని అభిమానులు చెబుతున్నారు. సరే ఎవరి వెర్షన్ లో వాళ్ళు కరెక్టే కానీ ఇక్కడ చెప్పింది కూడా లాజిక్కేగా.