పరమవీరచక్ర దారిలో ఆచార్య

ఎంత పెద్ద హీరో అయినా సరే కొన్నిసార్లు అనూహ్యమైన పరిస్థితులు ఎదురుకోవాల్సి ఉంటుంది. ఫలానా స్టార్ ఉన్నాడు కాబట్టి శాటిలైట్ ఛానళ్లు, ఓటిటిలు ఎగబడి కొంటాయన్న గ్యారెంటీ లేదు. కొన్ని సార్లు ఇవి రివర్స్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఉదాహరణకు బాలకృష్ణ నటించిన పరమవీరచక్ర 2011లో విడుదలయ్యింది. అంటే పదేళ్లు దాటిపోయింది. అయినా ఇప్పటిదాకా టీవీ టెలికాస్ట్ జరగలేదు. పోనీ విసిడి డివిడి రూపంలో వచ్చిందా అంటే అదీ లేదు. పోన్లే యుట్యూబ్ లో చూద్దామంటే అఫీషియల్ అప్లోడ్ ఉంటేగా.

కారణం ఒకటే. దీన్ని అప్పట్లో చెప్పిన రేట్ కు కొనేందుకు ఎవరూ ముందుకు రాకపోవడం. దిగ్గజ దర్శకులు దాసరి నారాయణరావు గారి నూటా యాభై చిత్రమిది. అయినా ఇంతటి పరాభవం తప్పలేదు. కంటెంట్ దారుణంగా ఉన్నప్పుడు ఎవరు మాత్రం ఏం చేయగలరు. ఇప్పుడు ఆచార్యకూ ఇదే పరిస్థితి రావొచ్చనే అంచనా టీవీ సర్కిల్స్ లో జరుగుతోంది. ముందు పదిహేను కోట్లకు కొన్న జెమిని తర్వాత కాజల్ అగర్వాల్ ని తీసేశారన్న కారణాన్ని సాకుగా చూపి సగానికి పైగా తగ్గింపుని డిమాండ్ చేశారనే ప్రచారం రెండు రోజులుగా జరుగుతోంది

ఇదెంత వరకు నిజమో కానీ ఆచార్య మాత్రం ఇప్పటిదాకా ప్రసారానికి నోచుకోలేదు. వచ్చినా టిఆర్పి రేటింగ్స్ వస్తాయనే నమ్మకం పెద్దగా లేదు. ఓటిటిలోనే ఎవరూ పట్టించుకోలేదు. ఒకవేళ నిర్మాతలు జెమినితో కనక అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుంటే మాత్రం ఇంకొక ఛానల్ తో మాట్లాడుకోవాల్సి ఉంటుంది. అదే జరిగితే నామమాత్రం సొమ్ములు వస్తాయి. డ్రాప్ అయితే మాత్రం పరమవీరచక్ర లాగా ఆచార్య కూడా బుల్లితెరకు దూరమైపోతుంది. ఫ్యాన్స్ మాత్రం అలా జరిగిన పర్లేదు మళ్ళీ ఈ కళాఖండం మాత్రం వద్దు బాబోయ్ అంటున్నారు