‘ఉప్పెన’ సినిమా బేబమ్మ పాత్ర చేయడం ద్వారా కుర్రాళ్ల గుండెల్లో తిష్ట వేసుకని కూర్చుంది కృతి శెట్టి. నిజానికి ఆ చిత్రానికి ముందు ఎంచుకున్న కథానాయిక వేరు. మేఘనా రాజ్ అనే అమ్మాయిని హీరోయిన్‌గా తీసుకోగా.. ఆమె సినిమా ప్రారంభోత్సవంలో కూడా పాల్గొంది. కానీ తర్వాత ఆమె ఈ చిత్రానికి ఆమె సెట్టవ్వదని భావించి తన స్థానంలో కృతిని తీసుకున్నాడు దర్శకుడు బుచ్చిబాబు సానా. మరి ఈ సినిమాలోకి కృతి శెట్టి ఎలా వచ్చింది.. అసలామె నేపథ్యం ఏంటి.. తన కుటుంబం సంగతేంటి అన్నది ఆసక్తికరం. ఓ ఇంటర్వ్యూలో తన ఫ్యామిలీ గురించి.. ‘ఉప్పెన’లో కథానాయికగా ఎంపిక కావడం గురించి.. ఆసక్తికర విషయాలు పంచుకుంది ఈ కన్నడ అమ్మాయి.
“మాది కర్ణాటకలోని ఉడుపి. నాన్న ముంబయిలో బిజినెస్ చేయడంతో మేం అక్కడే సెటిల్ అయ్యాం. మా అమ్మ ఫ్యాషన్ డిజైనర్. ఆమె వృత్తి రీత్యా నేను ఆరో క్లాసులో ఉండగా తెలిసిన వాళ్ల సాయంతో యాడ్స్ చేయడం మొదలుపెట్టా. ఇంటర్లో ఓ వర్క్ షాప్‌లో పాల్గొనడం వల్ల హృతిక్ రోషన్ సినిమా ‘సూపర్ 30’లో నటించే అవకాశం వచ్చింది. అందులో స్టూడెంట్‌గా చిన్న పాత్రలో నటించా. అప్పటికి నాకు సినిమాల్లో నటించాలని, హీరోయిన్ అవ్వాలని ఆలోచనే లేదు. ఐతే నాకు తెలిసిన వ్యక్తి నాకు తెలియకుండానే నా ఫొటోలను దర్శకుడు బుచ్చిబాబుకు పంపాడు. అవి చూసి నచ్చిన బుచ్చిబాబు గారు తన కథకు నేనే సూటవుతానని భావించి మా అమ్మానాన్నల్ని సంప్రదించారు.
నేనైతే ఉప్పెన సినిమాకు నో చెబుదామనే అనుకున్నా. కానీ అమ్మా నాన్నలే ప్రోత్సహించారు. కచ్చితంగా స్టారవుతావని, ఈ సినిమా చేయమని అన్నారు. కథ విన్నాక కచ్చితంగా ఈ సినిమా చేయాలనిపించి చేశాను. ఆ సినిమాతో నేను ఊహించని స్థాయిలో పేరు వచ్చింది. ఇప్పటికీ నేను ఎక్కడికి వెళ్లినా బేబమ్మ అని పిలుస్తుంటారు. ఇప్పుడు నేను చాలా సినిమాల్లో నటిస్తుండడంతో అమ్మ తన ప్రొఫెషన్ వదిలిపెట్టి నాతో పాటు ఉండేందుకు హైదరాబాద్‌కు వచ్చేసింది. నాన్న మాత్రం ముంబయిలోనే ఉంటున్నారు. ఆయన్ని చాలా మిస్ అవుతున్నా’’ అని కృతి వెల్లడించింది.