అందరి ఆశా అతడి మీదే..

బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ప‌రిస్థితులు ఏమాత్రం అనుకూలంగా లేని స‌మ‌యంలో ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ త‌న కెరీర్లోనే అతి పెద్ద ప‌రీక్ష‌కు సిద్ధ‌మ‌య్యాడు. త‌మిళ ద‌ర్శ‌కుడు లింగుస్వామి డైరెక్ష‌న్లో అత‌ను న‌టించిన ద్విభాషా చిత్రం ‘ది వారియ‌ర్’ గురువార‌మే ప్రేక్ష‌కుల ముందుకు వస్తోంది. తెలుగుతో పాటు తమిళంలోనూ ఈ చిత్రం ఒకేసారి విడుదలవుతోంది. ఈ సినిమా మీద కేవలం ఆ చిత్ర బృందమే కాదు.. ట్రేడ్ కూడా చాలా ఆశలు పెట్టుకుంది.

గత నెలలో మేజర్, విక్రమ్ సినిమాల తర్వాత బాక్సాఫీస్ దగ్గర సందడే లేదు. నెల రోజుల వ్యవధిలో వచ్చిన సినిమాలన్నీ బోల్తా కొట్టాయి. అందులోనూ జులై నెలలో పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. ఇప్పటిదాకా వచ్చిన సినిమాలు కనీస స్థాయిలో కూడా ఆకట్టుకోలేదు. దీనికి తోడు భారీ వర్షాలు రెండు తెలుగు రాష్ట్రాలను ముంచెత్తుతుండడంతో జనాలు థియేటర్ల వైపు కన్నెత్తి కూడా చూడట్లేదు. ఇలాంటి సమయంలో రామ్ సినిమా మంచి అంచనాల మధ్య థియేటర్లలోకి దిగుతోంది.

రామ్-లింగుస్వామి కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్‌‌కు తోడు ఇస్మార్ట్ శంకర్, రెడ్ సినిమాలతో రామ్ జోరుమీదుండడంతో ‘ది వారియర్’ మీద బయ్యర్లు చాలా భరోసాతో భారీ పెట్టుబడులే పెట్టేశారు. ఈ చిత్రానికి రెండు భాషల్లో కలిపి రూ.45 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ జరగడం గమనార్హం. ఐతే మామూలు రోజుల్లోనే ఇది రామ్‌కు చాలా పెద్ద టార్గెట్ అంటే.. కొవిడ్ తర్వాత పరిస్థితులు చాలా మారిపోయి, ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గిపోయి, అధిక టికెట్ ధరలకు తోడు వర్షాలు ప్రతికూల ప్రభావం చూపుతున్న సమయంలో ఈ టార్గెట్ అందుకోవడం అంటే అంత సులువు కాదు.

టికెట్ల రేట్లు, వర్షాల కారణంగా ఈ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఆశించిన స్థాయిలో జరగలేదు. ఈ నేపథ్యంలో సినిమాకు చాలా మంచి టాక్ రావడం కీలకం. మరి ఏమేర ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తాడు, ఎంత మేర తన బాక్సాఫీస్ స్టామినా చూపిస్తాడు అన్నది ఆసక్తికరం. మరోవైపు సాయిపల్లవి నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘గార్గి’ శుక్రవారం రిలీజవుతోంది. దీనిపై అంచనాలు తక్కువే ఉన్నాయి. మరి ఈ సీరియస్ మూవీతో ఆమె ఎలాంటి ఫలితాన్నందుకుంటుందో చూడాలి.