ఆచార్య సినిమా రిలీజై రెండున్నర నెలల కావస్తోంది. కానీ ఆ సినిమా తాలూకు చేదు అనుభవాలు ఇంకా దాని టీంను వెంటాడుతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా వ్యాపార వ్యవహారాల్లోనూ కీలకంగా వ్యవహరించిన పాపానికి దర్శకుడు కొరటాల మెడకు నష్ట పరిహారం వ్యవహారం చుట్టుకుని అల్లాడిపోతున్నాడు. ఈపాటికే ఎన్టీఆర్ సినిమాను మొదలు పెట్టాల్సిన ఆయన.. ఆ పని చేయలేకపోతున్నాడు.
ఆచార్య డిజాస్టర్ కావడం ఆయన మీద ఒత్తిడి పెంచగా.. డిస్ట్రిబ్యూటర్లకు సెటిల్మెంట్ చేసే విషయం ఎడతెగని విధంగా సాగుతూ.. తన కొత్త సినిమా మీద కొరటాల దృష్టిసారించలేని పరిస్థితి తలెత్తింది. కొన్ని ఏరియాల వరకు సెటిల్మెంట్ పూర్తయినా.. సీడెడ్ డిస్ట్రిబ్యూటర్లకు పరిహారం విషయంలో ఎటూ తేల్చకపోవడంతో వాళ్లు కొరటాల ఆఫీస్ వరకు వచ్చి ఆందోళన చేపట్టే పరిస్థితి వచ్చింది. కొంతమేర సెటిల్ చేసి, మిగతాది ఎన్టీఆర్ సినిమా రిలీజయ్యాక చూద్దామని కొరటాల సర్దిచెప్పే ప్రయత్నం చేసినా వారు వినట్లేదని.. తాము ఎంత నష్టపోయామో అంతా చెల్లింపులు చేయాలని కోరుతున్నట్లు తెలుస్తోంది.
ఐతే డిస్ట్రిబ్యూటర్లు భారీగా నష్టపోతే కొంత మేర సెటిల్ చేయడం వరకు ఓకే కానీ.. మొత్తం నష్టాన్ని భరించాలంటే ఎలా అన్నది కొరటాల క్యాంప్ నుంచి ఎదురవుతున్న ప్రశ్న. డిస్ట్రిబ్యూటర్లు భారీగా లాభాలు అందుకుంటే వాటిలోంచి వాటి ఇస్తారా అని కొరటాల మద్దతుదారులు అంటున్నారు. ఐతే ఈ వ్యవహారంలో చిరు చేతులెత్తేస్తున్నట్లుగా వస్తున్న వార్తలే దారుణం. ఈ క్రమంలోనే #justiceforkoratalashiva అనే హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్లో ట్రెండ్ అవుతోంది. చిరును ట్రోల్ చేయడానికే ఈ హ్యాష్ ట్యాగ్ అన్నది స్పష్టం. దాని మీద అన్నీ కించపరిచే పోస్టులే ఉన్నాయి. విపరీతమైన ట్రోలింగ్ నడుస్తోంది.
కానీ ఆచార్య నష్టాల భర్తీ కోసం చిరు, చరణ్ ఇద్దరూ తమకు పారితోషకం కింద రావాల్సిన డబ్బులన్నీ వదులుకున్న మాట వాస్తవం. సినిమాకు సంబంధించి ఎవ్వరూ ముందు రెమ్యూనరేషన్లు తీసుకోలేదు. రిలీజ్ తర్వాత చూసుకుందాం అనుకున్నారు. కానీ తర్వాత ఒక్క రూపాయి కూడా తీసుకునే అవకాశం దక్కలేదు. మరోవైపు కొరటాల కూడా పారితోషకం వదులుకుని, సొంతంగా డబ్బులు పెట్టి డిస్ట్రిబ్యూటర్లకు సెటిల్ చేస్తున్నాడు. మరి దర్శకుడు, హీరోలు ఇంత త్యాగం చేసినపుడు.. ఈ సినిమాతో డబ్బులు చేసుకున్న నిర్మాత సంగతేంటన్నది ప్రశ్నార్థకం.