తన సినిమాలన్నీ ఒకే తరహాలో ఉంటున్నాయన్న విమర్శకు సమాధానంగా.. టాలీవుడ్లో అసలున్నవే రెండే రకాల కథలని.. వాటినే తిప్పి తిప్పి సినిమాలు తీస్తుంటారని స్టేట్మెంట్ ఇచ్చాడు సీనియర్ దర్శకుడు తేజ ఒక సందర్భంలో. ఆయనన్నట్లు మరీ రెండు కథలే తిప్పి తిప్పి తీస్తుంటారన్నది వాస్తవం కాదు కానీ.. కథలైతే రిపీటవుతుంటాయన్నది వాస్తవం.
ఒక వ్యక్తి లైఫ్ జర్నీని వివిధ దశల్లో చూపించే కథలు గతంలో కొన్ని రాగా.. ఆ లైన్లో స్టోరీలు రిపీటవడం చూస్తూనే ఉన్నాం. నాగచైతన్య కొత్త చిత్రం థ్యాంక్ యు కూడా ఆ టైపు సినిమా లాగే కనిపిస్తోంది. ఆటోగ్రాఫ్ స్వీట్ మొమెరీస్ మూవీతో ఈ సినిమాకు చాలా వరకు పోలికలు కనిపిస్తున్నాయి. స్వయంగా చైతూనే ఈ టైపు సినిమా ఒకటి చేశాడు. అదే.. ప్రేమమ్. మలయాళంలో అదే పేరుతో తెరకెక్కిన బ్లాక్‌బస్టర్ మూవీకి అది రీమేక్ అన్న సంగతి తెలిసిందే. అందులోనూ ఒక వ్యక్తి జీవితంలో వివిధ దశలు కనిపిస్తాయి. లుక్స్, క్యారెక్టర్‌కు సంబంధించి జీవిత దశలు, ప్రేమ వ్యవహారాల పరంగా ఆ సినిమా, థ్యాంక్ యు చాలా దగ్గరగా కనిపిస్తున్నాయి.
ఇక మహేష్ బాబు మూవీ మహర్షిని కూడా గుర్తుకు తెచ్చింది థ్యాంక్ యు ట్రైలర్. జీవితంలో సక్సెసే పరమావధి అనుకునే వ్యక్తి.. తర్వాత వాస్తవం బోధపడి, తాను ఏం కోల్పోతున్నానో తెలుసుకుని.. తన విజయానికి కారణమైన వ్యక్తుల కోసం తపించే కథతో తెరకెక్కింది మహర్షి మూవీ. సరిగ్గా ఇదే లైన్ థ్యాంక్ యు లోనూ కనిపిస్తోంది. మహర్షిలో రిషి పాత్రతో చైతూ క్యారెక్టర్‌కు పోలికలు కనిపిస్తున్నాయి. కాకపోతే మహేష్ లాగా ఒక కాజ్ కోసం పోరాడై టైపులో చైతూ కనిపించడం లేదు. కానీ సినిమాలో మహర్షి టచ్ అయితే కనిపిస్తోంది. విశేషం ఏంటంటే.. ఈ చిత్రంలో చైతూ మహేష్ బాబు అభిమానిగా కనిపించనున్నాడు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన థ్యాంక్ యు ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.