ఈ ఏడాది టాప్ హిట్స్ లో ఒకటిగా చోటు దక్కించుకున్న ఎఫ్3 జూలై 22 నుంచి ఓటిటిలో రానున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు సోనీ లివ్ ప్రమోషన్ మొదలుపెట్టేసింది. అయితే అనూహ్యంగా ఇప్పుడిది నెట్ ఫ్లిక్స్ లో కూడా అందుబాటులో రానుంది. ఇది ఫ్యాన్స్ ఊహించనిది. కారణం లేకపోలేదు. సోనీకి సబ్స్క్రైబర్స్ రీచ్ తక్కువ. ఇప్పుడిప్పుడే ఆకట్టుకునే కంటెంట్ తో ఎదిగే స్టేజిలో ఉంది. ఏకంగా ప్రైమ్, హాట్ స్టార్ లాంటి దిగ్గజాలతో పోటీ ఇచ్చే స్టేజికి చేరుకోలేదు. దానికి ఇంకొంత సమయం అవసరమవుతుంది.
అందుకే ఎఫ్3ని అత్యధిక ప్రేక్షకులను అందివ్వాలనే ఉద్దేశంతో ఎఫ్3ని నెట్ ఫ్లిక్స్ తో పాటు పంచుకోనుంది. గతంలోనూ ఇదే తరహాలో సన్ నెక్స్ట్ తన కొత్త సినిమాలు పంచుకునే పద్ధతిని అల వైకుంఠపురములోతో మొదలుపెట్టింది. ఇటీవలే వచ్చిన డాక్టర్, ఈటి, పెద్దన్నలకు సైతం ఇదే ఫాలో అయ్యింది. ఇప్పుడు సోనీ లివ్ ఇదే బాట పట్టింది. నెట్ ఫ్లిక్స్ లో బొమ్మ పడితే ఏ రేంజ్ కు వెళ్తుందో ఆర్ఆర్ఆర్ విషయంలో చూశాం. అన్ని భాషలను కాదని కేవలం అందులో ఉన్న కారణంగా హిందీ వెర్షన్ కు బ్రహ్మరథం దక్కింది.
సో ఎఫ్3ని హ్యాపీగా మన సౌకర్యాన్ని బట్టి ఈ రెండిట్లో దేంట్లో అయినా చూసుకోవచ్చన్న మాట. మహా అయితే నెల లేకా ఇంకో పది రోజులు అదనంగా తప్ప థియేటర్ కు ఓటిటికి మధ్య గ్యాప్ పెరిగిపోతున్న తరుణంలో సుమారు రెండు నెలలకు ఎఫ్3 డిజిటల్ రూటు పట్టడం గమనార్హం. దిల్ రాజు ఇకపై అన్ని సినిమాలకు ఇదే పద్ధతి ఫాలో అవుతారా లేక ఎఫ్3కి మాత్రమే పరిమితమా అనేది వేచి చూడాలి. ఎలాగూ నిర్మాతల మండలి ఫిఫ్టీ డేస్ కండీషన్స్ పెట్టేసుకుంది కాబట్టి అది అమలులోకి రావడమే ఆలస్యం.