ప్రభాస్‌తో కృష్ణవంశీ ఆ సినిమా చేసి ఉంటే..

ఈశ్వర్, రాఘవేంద్ర చిత్రాలు అనుకున్నంతగా ఆడకపోయినా వర్షం సినిమాతో స్టార్ ఇమేజ్ సంపాదించాడు ప్రభాస్. ఆ సమయంలో అతను కృష్ణవంశీ లాంటి స్టార్ డైరెక్టర్‌తో జట్టు కట్టడంతో వీరి కాంబినేషన్లో సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ వీరి నుంచి ప్రేక్షకులు ఊహించిన దానికి భిన్నంగా చాలా వరకు క్లాస్‌గా, విషాదభరితమైన ముగింపుతో వచ్చిన ‘చక్రం’ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. ప్రభాస్ ఇమేజ్‌కు అసలు సరిపడని సినిమా అంటూ అప్పట్లో తన అభిమానులు నిరాశ పడ్డారు.

ఐతే ప్రభాస్‌తో నిజానికి కృష్ణవంశీ అప్పుడు తీయాలనుకున్న సినిమా ఇది కాదట. రాయలసీమ నేపథ్యంలో గుప్త నిధుల చుట్టూ తిరిగే ఫుల్ లెంగ్త్ యాక్షన్ మూవీ చేయాలని కృష్ణవంశీ అనుకున్నాడట. రాయలసీమలో ఫ్యాక్షన్ ఎంత ఫేమస్సో గుప్తనిధుల కాన్సెప్ట్ కూడా అంతే ఫేమస్ అని అందుకే ఆ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా తీయాలనుకున్నానని కృష్ణవంశీ చెప్పాడు.

మ్యాడ్ మ్యాక్స్ సిరీస్ తరహాలో రగ్డ్‌నెస్, డస్ట్, యాక్షన్ మిక్స్ అయిన సినిమా తీయాలని తాను ప్లాన్ చేశానని.. అందులో ఫుల్ యాక్షన్ ఉండేదని, ప్రభాస్‌ ఇమేజ్‌కు కూడా బాగా సెట్ అయ్యేదని కృష్ణవంశీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఐతే ముందు ఆ కథ చెప్పి.. ఆ తర్వాత ‘చక్రం’ స్టోరీ చెప్పానని.. ప్రభాస్ రెండోదానికే ఓటేశాడని ఆయన వెల్లడించాడు. తన దగ్గరికి అందరూ యాక్షన్ కథలే తెస్తున్నారని.. కానీ తాను మీ దగ్గరికి వచ్చిందే పెర్ఫామెన్స్ స్కోప్ ఉన్న డిఫరెంట్ మూవీ చేయాలని.. కాబట్టి రెండో కథే చేద్దామని తనతో ప్రభాస్ చెప్పాడని.. తన ఇమేజ్ గురించి ఆలోచించకుండా వైవిధ్యమైన సినిమా చేయాలని ప్రభాస్ అనుకోవడం తనకు చాలా నచ్చిందని కృష్ణవంశీ గుర్తు చేసుకున్నాడు.

‘చక్రం’ బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అయినప్పటికీ.. ఈ సినిమాను ఇష్టపడేవాళ్లు కూడా ఉన్నారని.. ఇప్పటికీ దాని గురించి గుర్తు చేసుకుంటూ ఉంటారని.. ప్రభాస్‌ను అలా చూసి ఇష్టపడ్డ వాళ్ల సంఖ్య తక్కువేమీ కాదని.. కాబట్టి అప్పుడు ప్రభాస్ తీసుకున్న నిర్ణయం తప్పేమీ కాదని కృష్ణవంశీ అన్నాడు.