థియేటర్ రంగం మునుపెన్నడూ లేని స్లంప్ ఎదుర్కొంటోందిప్పుడు. ఇది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ట్రెండే. కొవిడ్ తర్వాత పరిస్థితులు అలా మారిపోయాయి మరి. జనాలకు కొంత కాలం పాటు థియేటర్లకు వచ్చే అలవాటు తప్పడం, ఓటీటీలకు అలవాటు పడడం ఇందుకు కొంత మేర కారణమైతే.. టికెట్ల ధరల్ని విపరీతంగా పెంచేయడం ఇంకొంతమేర కారణంగా మారింది.
చాలా కొన్ని సినిమాలను మాత్రమే థియేటర్లలో చూడడానికి జనం ఎగబడుతున్నారు. మరి వాళ్లను ఆకర్షించాలంటే ఎలాంటి సినిమాలు తీయాలో తెలియక తికమక పడుతున్నారు దర్శక నిర్మాతలు. వాళ్లందరికీ దర్శక ధీరుడు రాజమౌళి ఒక సలహా ఇచ్చాడు. లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో తెరకెక్కిన హ్యాపీ బర్త్ డే మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ సందర్భంగా జక్కన్న ఈ సూచన చేశాడు.
జనాల్ని థియేటర్లకు రప్పించే విషయంలో తనకంటూ ఒక అనాలసిస్ ఉందని రాజమౌళి చెప్పాడు. కామెడీ సినిమా తీస్తే.. జనాలు విరగబడి నవ్వేలా తీయాలని, యాక్షన్ సినిమా చేస్తే ఫైట్లు టాప్ లెవెల్లో ఉండాలని.. ఇలా ఏ జానర్ సినిమా తీసినా రాజీ అన్నది లేకుండా ఫుల్ ప్లెడ్జ్డ్ సినిమా తీయాలని.. అప్పుడు ఆ జానర్‌ను ఇష్టపడే ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమా చూస్తారని రాజమౌళి అన్నాడు.
హాఫ్ హార్టెడ్‌గా సినిమాలు తీస్తే జనాలు థియేటర్లకు రావట్లేదని.. ఫుల్ ప్లెడ్జ్డ్‌గా తీస్తే మాత్రం కచ్చితంగా జనాలు వస్తారని.. ఇది తన అనాలసిస్ అని జక్కన్న అన్నాడు. హ్యాపీ బర్త్‌డే సినిమా కామెడీ, థ్రిల్ కలిపి ఫుల్ ప్లెడ్జ్డ్‌గా తీసినట్లు అనిపిస్తోందని.. కాబట్టి ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ అవుతుందని నమ్ముతున్నానని రాజమౌళి చెప్పాడు. ఈ సినిమా పోస్టర్ మీద పాన్ తెలుగు మూవీ అని వేయడం.. తెలుగు అనే పదాన్ని వివిధ భాషల్లో రాయడం తననెంతో ఆకట్టుకుందని, అది చూసి తాను బాగా నవ్వుకున్నానని రాజమౌళి పేర్కొన్నాడు.