ప్యాన్ తెలుగు – ఇదీ అసలు రహస్యం

చిన్నా పెద్దా హీరో తేడా లేకుండా ఎక్కువ తక్కువ బడ్జెట్ తో సంబంధం లేకుండా ఓ రెండు మూడు భాషల్లో డబ్బింగ్ చేస్తే చాలు అందరూ వాడుతున్న ఊతపదం ప్యాన్ ఇండియా. ఆఖరికి కొన్నేళ్లుగా హిట్టే లేని యూత్ హీరోలు కూడా పట్టుబట్టి మరీ ఈ ట్యాగ్ లు వేయించి ప్రమోట్ చేస్తున్నారు. అందుకే హ్యాపీ బర్త్ డే బృందం కొత్త స్ట్రాటజీగా ప్యాన్ తెలుగు అనే పదాన్ని తీసుకొచ్చింది. విడుదలైన ట్రైలర్ సోషల్ మీడియాలో బాగానే ట్రెండ్ అవుతోంది. అమెరికా తరహాలో విచ్చలవిడి తుపాకీల సంస్కృతి మనదగ్గరా ఉంటే ఎలా ఉంటుందన్న పాయింట్ తో దీన్ని తీశారు. నో లాజిక్స్ అంటూ ముందే హింట్లు కూడా ఇస్తున్నారు.

పోస్టర్ల దగ్గర నుంచి ట్రైలర్ దాకా ప్రతి చోట తెలుగుతో పాటు తమిళ మలయాళం హిందీ కన్నడలో విడుదల చేస్తున్నట్టు కింద హింట్ ఇవ్వడంతో అందరూ ఇది నిజంగానే ఆయా భాషల్లో డబ్బింగ్ అవుతుందనుకుంటున్నారు. నిజానికి అది కాదుట. దర్శకుడు నితిష్ రానా దానికి సంబంధించిన క్లారిటీ ఇచ్చాడు. ఇది అచ్చ తెలుగు సినిమా మాత్రమేనని దేంట్లోనూ డబ్బింగ్ చేయడం లేదని, జాగ్రత్తగా గమనిస్తే అన్ని లాంగ్వేజెస్ లో తెలుగనే ఉంటుందని చెప్పి ట్విస్ట్ ఇచ్చారు. అప్పుడు కానీ ఈవెంట్ కొచ్చినోళ్లకు బల్బు వెలగలేదు.

సో హ్యాపీ బర్త్ డే కేవలం మన భాషలో మాత్రమే వస్తోంది. ఈ మధ్య సక్సెస్ లేక వెనుకబడిపోయిన లావణ్య త్రిపాఠి ఇందులో ప్రధాన పాత్ర చేయడంతో దీని మీద చాలా నమ్మకం పెట్టుకుంది. ట్రెండీగా ఇప్పటిదాకా మన ఆడియన్స్ కి పరిచయం లేని జానర్ ని నితిష్ తీసుకోవడంతో యూత్ లో దీని మీద మంచి అంచనాలు ఏర్పడుతున్నాయి. థాంక్ యు డ్రాప్ కావడం వల్ల వారం ముందే జూలై 8న వస్తున్న హ్యాపీ బర్త్ డే మత్తు వదలరా తరహాలో సర్ప్రైజ్ హిట్ అవుతుందనే నమ్మకంతో మేకర్స్ ఉన్నారు. చూడాలి ఏం చేస్తుందో.