మనోజ్ వదిలేశాడు – వైష్ణవ్ పట్టేశాడు

కొన్ని ప్రాజెక్టులు అనూహ్యంగా చేతులు మారడం ఎప్పటి నుంచో చూస్తున్నదే. కొన్నిసార్లు పొరపాటు నిర్ణయాల వల్ల అయ్యో అనుకున్న హీరోలు ఎందరో. పోకిరి, ఇడియట్, అతడు లాంటివి ముందు పవన్ కళ్యాణ్ దగ్గరకు వెళ్లాయన్న వాస్తవం పవర్ స్టార్ ఫ్యాన్స్ ని తలుచుకున్నప్పడంతా మెలితిప్పుతూనే ఉంటుంది. తన దగ్గరకు వచ్చిన నువ్వే కావాలి కథను సుమంత్ కనక ఓకే చేసి ఉంటె ఇప్పడు అతని కెరీర్ ఇంకోలా ఉండేదేమో. ఇలా చెప్పుకుంటూ పోతే హిట్లు ఫ్లాపులు రెండింటిలో బోలెడన్ని ఉదాహరణలు కనిపిస్తాయి.

ఇప్పుడీ ప్రస్తావన రావడనికి కారణం వైష్ణవ్ తేజ్ కొత్త సినిమా. ఇవాళ అనౌన్స్ మెంట్ ఇచ్చారు. ఉప్పెన, కొండపొలం, రంగ రంగ వైభవంగా తర్వాత చేస్తున్న నాలుగో చిత్రంగా అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చింది. దర్శకుడు శ్రీకాంత్ ఎన్ రెడ్డి. ఈ పేరు ఎక్కడో విన్నట్టు ఉందా. కొన్నేళ్ల క్రితం మంచు మనోజ్ తో అహం బ్రహ్మస్మిని అట్టహాసంగా మొదలుపెట్టింది ఇతనే. ఆ ప్రారంభోత్సవానికి రామ్ చరణ్ అతిధిగా రావడంతో కొన్నాళ్ల పాటు దాని గురించిన చర్చ సోషల్ మీడియాలో జరిగింది. పోస్టర్లు ఆసక్తి రేపిన మాట వాస్తవం.

కట్ చేస్తే ఇప్పుడు వైష్ణవ్ తేజ్ మూవీకి ఇతనే డైరెక్టర్ కావడంతో ఆ అహం బ్రహ్మస్మినే మళ్ళీ తీస్తున్నారా అనే అనుమానం కలుగుతోంది. వ్యక్తిగత కారణాల వల్ల మనోజ్ సినిమాలు చేయడం మానేశాడు. ఇది తనకు మంచి కంబ్యాక్ అవుతుందని ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు. తీరా చూస్తే ఆగిపోయింది. మంచు కాంపౌండ్ నుంచి జనం నుంచి చెప్పుకోదగ్గ సాఫ్ట్ కార్నర్ ఉన్నది ఒక్క మనోజ్ కే. అలాంటి హీరోకు ఇలా జరగడం బాధ కలిగించేదే. అదో కాదో కానీ కాన్సెప్ట్ లో పోలికలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి