మహర్షి మత్తులోంచి బయటికి రాలేదా?

‘మహర్షి’కి అన్నీ కలిసొచ్చి హిట్ అయింది కానీ.. ఆ సినిమా విషయంలో జనాలకు చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. ఈ చిత్రంలో చాలా అంశాలు ఆర్టిఫిషియల్‌‌గా, మొనాటనస్‌ ఫీలింగ్ కలిగించాయి. మహేష్ బాబు లుక్, స్క్రీన్ ప్రెజెన్స్, అతడి పాత్ర.. అన్నీ కూడా మూసగా అనిపించాయి జనాలకు. ఈ సూటూ బూటు క్యారెక్టర్లు ఇంకెంత కాలం చేస్తాడనే కామెంట్లు కూడా వినిపించాయి అప్పుడు.

ఈ చిత్రం తర్వాత మహేష్‌తో వంశీ పైడిపల్లి ఇంకో సినిమా అనౌన్స్ చేయగానే.. ఈసారి కొంచెం రూటు మార్చి భిన్నమైన సినిమా తీయాలని కోరుకున్నారు అభిమానులు. కానీ కారణాలేంటో కానీ.. ఆ ప్రాజెక్టు క్యాన్సిల్ అయింది. మహేష్ వేరే సినిమాల పైకి వెళ్లిపోయాడు. వంశీ కొంతం కాలం ఏం చేయాలో పాలుపోని స్థితిలో కనిపించాడు. చివరికి తమిళ హీరో విజయ్‌‌తో అతను ద్విభాషా చిత్రాన్ని లైన్లో పెట్టాడు. ఇప్పటిదాకా వంశీ సినిమాలన్నింటినీ నిర్మించిన దిల్ రాజే ఈ చిత్రాన్ని కూడా ప్రొడ్యూస్ చేస్తున్నాడు.

బుధవారం విజయ్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఈ చిత్ర ఫస్ట్ లుక్ లాంచ్ చేశారు. ఈ లుక్ విషయంలో ట్విట్టర్లో పోల్స్ పెడితే అందరూ నెగెటివ్‌గానే స్పందిస్తున్నారు. తమిళంలో విజయ్ ఫ్యాన్స్ ఆహా ఓహో అనేస్తున్నారు కానీ.. మన ప్రేక్షకులకు మాత్రం ఆ లుక్ చాలా రొటీన్‌గా అనిపిస్తోంది. వంశీ మళ్లీ మహర్షి లాంటి సినిమానే తీస్తున్నాడా అన్న సందేహాలు కలిగించింది ఆ లుక్.

‘వారసుడు’ అనే టైటిల్ పెట్టడం.. బాస్ రిటర్న్స్ అనే ట్యాగ్ జోడించడం చూసి.. విదేశాల్లో ఉన్న హీరో ఇండియాకు వచ్చి ఏదో కాజ్ కోసం పోరాడే కథ అయ్యుంటుందన్న అభిప్రాయానికి వచ్చేస్తున్నారంతా. విజయ్ మామూలుగా మాస్ అవతారాల్లో కనిపిస్తుంటాడు. కానీ వంశీ సినిమా అనేసరికి సూటూ బూటూ వేసేయడంతో ఇదేమైనా ‘మహర్షి-2’నా అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. అందులోనూ ‘మహర్షి’ రచయితలే ఈ సినిమాకు కూడా పని చేయడం, నిర్మాత కూడా దిల్ రాజే కావడంతో ఆ ఫీల్ వదలట్లేదు. మరి వంశీ నిజంగానే ‘మహర్షి’ మత్తులో ఉన్నాడా.. లేదా ఈ అంచనాలకు భిన్నంగా కొత్త సినిమా ఏదైనా చూపిస్తాడా అన్నది చూడాలి.