సినిమా టికెట్ల రేట్ల విషయంలో ఎడతెగని చర్చ జరుగుతోంది టాలీవుడ్లో. గత ఏడాది ఆంధ్రప్రదేశ్‌లో జగన్ సర్కారు అసాధారణ రీతిలో టికెట్ల రేట్లు తగ్గించేయడంతో మొదలైంది ఈ చర్చ. చిన్న సెంటర్ల పేరు చెప్పి రేట్లను మరీ తగ్గించేయడం, థియేటర్ల మెయింటైనెన్స్ కూడా కష్టమయ్యే పరిస్థితి రావడంతో ఈ పరిణామాలపై సినీ జనాలు గగ్గోలు పెట్టారు. ఎడతెగని చర్చలు, సంప్రదింపుల తర్వాత ఏపీలో రేట్లు పెరిగాయి.
అంతకంటే ముందు తెలంగాణలో సాధారణ స్థాయిలో ఉన్న ధరలను విపరీంగా పెంచి పడేశారు. ఇప్పుడు పెరిగిన రేట్లు గుదిబండలా మారాయి. ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గించేశారు. దీంతో నిర్మాతలు పునరాలోచనలో పడ్డారు. ఈ క్రమంలోనే కొన్ని సినిమాలకు రేట్లు తగ్గించడం తెలిసిందే. ఈ పరిణామాలపై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టికెట్ల రేట్ల విషయంలో టాలీవుడ్ తప్పు చేసిందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఏపీలో టికెట్ల ధరల పెంపు కోసం అప్పటి మంత్రి పేర్ని నానితో చర్చలు జరిపిన వాళ్లలో రామ్ గోపాల్ వర్మ కూడా ఒకరు. రేట్లు పెంచాలని ఆయన కూడా గట్టిగా వాయిస్ వినిపించారు. మరి ఇప్పుడు టికెట్ల ధరలు పెరగడం సమస్యగా మారడంపై వర్మ స్పందిస్తూ.. “జనాలు ఎక్కువ రేట్లను భరించలేరని ఏపీ సీఎం జగన్ రేట్లు తగ్గించారు. కానీ మేం మాత్రం ఎక్కువ రేట్లుండాల్సిందే అని పట్టుబట్టాం. నేను కూడా గట్టిగా మాట్లాడాను. కానీ ఇప్పుడు రేట్లు పెరగడం వల్ల జనాలు థియేటర్లకు రావట్లేదు. ఇది గమనించి నిర్మాతలు తమ సినిమాలకు ధరలు తగ్గించుకుంటున్నారు. రేట్ల పెంపు కోసం మేం చేసింది తప్పు కాదు. పెద్ద బ్లండర్. ఈ విషయంలో జగనే కరెక్ట్. మేమంతా జోకర్లయిపోయాం” అని వర్మ అన్నాడు.
ఐతే ఏపీలో తలెత్తిన సమస్యకు వర్మ మాట్లాడిందానికి సంబంధం లేదు. అక్కడ గత ఏడాది చిన్న సెంటర్ల పేరు చెప్పీ మరీ రేట్లు తగ్గించడమే సమస్యగా మారింది. ఇప్పుడు కూడా తలనొప్పిగా, ప్రేక్షకులకు అభ్యంతరకరంగా మారింది తెలంగాణ రేట్లే.