ప్రస్తుతం టాలీవుడ్లో మోస్ట్ సీనియర్ ప్రొడ్యూసర్లలో సురేష్ బాబు ఒకరు. సినిమాల నిర్మాణం, పంపిణీ, రిలీజ్ విషయంలో చాలా పకడ్బందీగా వ్యవహరిస్తారని ఆయనకు పేరుంది. కథల ఎంపిక దగ్గర్నుంచి సినిమాల ఫలితం వరకు ఆయనకు మంచి జడ్జిమెంట్ ఉందని అంతా చెప్పుకుంటారు.
ఈ రోజుల్లో నిర్మాణం చాలా రిస్కీగా మారిన నేపథ్యంలో పెద్ద బడ్జెట్ సినిమాల జోలికి వెళ్లకుండా.. చాలా వరకు చిన్న, మీడియం రేంజ్ సినిమాల్లో భాగస్వామి అవుతుండటం, అందులోనూ పూర్తిగా పెట్టుబడి పెట్టకుండా, కొంత మేరే వాటా తీసుకుంటూ సేఫ్ గేమ్ ఆడుతుండటం గమనించవచ్చు.
‘విరాటపర్వం’ విషయంలోనూ ఆయన అలాగే చేశారు. ఈ సినిమాకు ఆయన సమర్పకుడు మాత్రమే. ఖర్చంతా పెట్టుకుంది సుధాకర్ చెరుకూరినే. ఐతే బిజినెస్ మొత్తం సురేష్ బాబు చేతుల మీదుగానే జరిగింది. ఐతే కరోనాకు ముందు మొదలైన ‘విరాటపర్వం’ రిలీజ్ విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం తెలిసిందే.
దీంతో పాటే సురేష్ బాబు వెంకటేష్‌తో తీసిన నారప్ప, దృశ్యం-2 చిత్రాలను తీవ్ర వ్యతిరేకత మధ్య థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి ఓటీటీకి ఇచ్చేయడం తెలిసిందే. ఆ రెండు చిత్రాలను మంచి లాభానికే ఓటీటీలకు ఇచ్చారు సురేష్ బాబు. ఒక దశలో ‘విరాటపర్వం’ సినిమాకు కూడా ఓటీటీ డీల్ పూర్తయిందని, థియేట్రికల్ రిలీజ్ ఉండదని జోరుగా ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్లే ఈ సినిమా వార్తల్లో లేకుండా పోయింది. కానీ మధ్యలో ఏం జరిగిందో ఏమో.. చాలా గ్యాప్ తర్వాత ఈ చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. గట్టిగా ప్రమోట్ చేసి ఈ శుక్రవారం విడుదల చేశారు. సినిమాకు చాలా వరకు పాజిటివ్ టాకే వచ్చింది. కానీ ఇది నెమ్మదిగా సాగే సీరియస్ మూవీ, పైగా విషాదాంతం కావడంతో ఎక్కువగా వినోదం కోసమే థియేటర్లకు వస్తున్న ప్రేక్షకులు దీన్ని అనుకున్నంత స్థాయిలో ఆదరించట్లేదు.
తొలి వీకెండ్లోనే కలెక్షన్లు లేక థియేటర్లు వెలవెలబోతున్నాయి. ఆదివారం కొంత వరకు సినిమా హోల్డ్ చేయొచ్చు కానీ.. వీకెండ్ తర్వాత నిలబడ్డం చాలా కష్టంగా ఉంది. ఈ సినిమా బాక్సాఫీస్ నంబర్స్ చూస్తుంటే.. థియేట్రికల్ రిలీజ్ ఎందుకు చేశారు, దీని బదులు నేరుగా ఓటీటీలో రిలీజ్ చేసి ఉంటే మంచి లాభాలు వచ్చి ఉండేవి కదా అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ విషయంలో సురేష్ బాబు తప్పటడుగు వేశాడని అంటున్నారంతా.