క్లియరెన్స్ సేల్ మళ్లీ వచ్చింది

అప్పుడప్పుడూ బాక్సాఫీస్‌లో స్తబ్దత నెలకొంటూ ఉంటుంది. ఉన్నట్లుండి కాస్త పేరున్న సినిమాలన్నీ సైడ్ తీసుకుని ఒక వీకెండ్‌ను ఖాళీగా వదిలేస్తుంటాయి. ఎప్పట్నుంచో విడుదల కోసం ఎదురు చూస్తున్న చిన్న సినిమాలు ఆ ఖాళీనీ వాడుకోవడానికి ముందుకొస్తుంటాయి. ఇలా ఒకటీ రెండూ కాదు.. చాలా సినిమాలు ఒకేసారి బాక్సాఫీస్ బరిలోకి దూకేస్తుంటాయి. సాధారణంగా అన్ సీజన్ అయిన ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఈ పరిస్థితి కనిపిస్తుంటుంది.

ఐతే ఈ ఏడాది కరోనా తర్వాత మారిన పరిస్థితుల వల్ల ఆ రెండు నెలల్లో భారీ చిత్రాలు చెప్పుకోదగ్గ సంఖ్యలో ప్రేక్షకులను పలకరించాయి. ఆ తర్వాత వేసవి అంతా పెద్ద సినిమాల సందడి కొనసాగింది. ఇప్పుడు భారీ చిత్రాల హడావుడి తగ్గింది. వరుసగా మీడియం రేంజ్ సినిమాలు రిలీజవుతున్నాయి. వీటి మధ్య ఒక వీకెండ్ చిన్న సినిమాలకు వదిలేశారు. తర్వాతి వీకెండ్ అలాంటిదే. అరడజను సినిమాల దాకా వచ్చేవారం బాక్సాఫీస్ పోరుకు సై అంటున్నాయి.

రామ్ గోపాల్ వర్మ పెండింగ్ సినిమాల్లో ఒకటైన ‘కొండా’ వచ్చే గురువారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం చాలాసార్లు వాయిదా పడి.. చివరికి జూన్ 23కు ఫిక్సయింది. ఐతే ప్రస్తుతానికి ఉన్న అంచనా ప్రకారం అయితే.. వర్మ గత సినిమాల మాదిరే ఇది కూడా ఇలా వచ్చి అలా వెళ్లిపోయేలాగే కనిపిస్తోంది. దీనికి పెద్దగా బజ్ ఏమీ లేదు. వర్మ సినిమా సంగతి పక్కన పెట్టేస్తే.. 24న ‘సమ్మతమే’ అనే ప్రేమకథా చిత్రం రిలీజవుతోంది. రాజా వారు రాణి వారు, ఎస్ఆర్ కళ్యాణమండపం చిత్రాల హీరో కిరణ్ అబ్బవరపు కథానాయకుడిగా, చాందిన చౌదరి కథానాయికగా నటించిన ఈ లవ్ స్టోరీ ప్రోమోలతో పర్వాలేదనిపిస్తోంది.

అదే రోజు పూరి జగన్నాథ్ తనయుడు పూరి ఆకాశ్ లీడ్ రోల్ చేసిన ‘చోర్ బజార్’ కూడా రిలీజవుతోంది. ఈ సినిమా కూడా చాన్నాళ్ల నుంచి విడుదల కోసం చూస్తున్న సినిమానే. ‘జార్జి రెడ్డి’ దర్శకుడు జీవన్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందించాడు. 24నే రానున్న మరో చిన్న సినిమా ‘7 డేస్ 6 నైట్స్’. ఎమ్మెస్ రాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ బోల్డ్ మూవీలో ఆయన తనయుడు సుమంత్ అశ్విన్ హీరోగా నటించాడు. ఇవి కాక టెన్త్ క్లాస్ డైరీస్, గ్యాంగ్ స్టర్ గంగరాజు లాంటి చిన్న సినిమాలు మరికొన్ని ఈ క్లియరెన్స్ సేల్‌లో థియేటర్లలోకి దిగేస్తున్నాయి.