లాల్ సింగ్ ని లెక్క చేయడం లేదు

మాములుగా అమీర్ ఖాన్ అంతటి స్టార్ హీరో సినిమా వస్తోందంటే ఎవరూ పోటీకి సిద్ధపడరు. అందులోనూ ఆయన ఏడాదికొకటి చేసే రకం కాదు. మినిమమ్ రెండుమూడేళ్ల గ్యాప్ ఉంటుంది. అలాంటిది లాల్ సింగ్ చద్దాకు ఫ్రీ గ్రౌండ్ ఇచ్చేందుకు ఎవరూ సిద్ధంగా లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇవాళ ఉన్నట్టుండి అక్షయ్ కుమార్ రక్షా బంధన్ ని ఆగస్ట్ 11 విడుదలని అనౌన్స్ చేసేశారు.

లాల్ సింగ్ చద్దా ఈ డేట్ ని చాలా రోజుల క్రితం బుక్ చేసుకుంది. అయినా కూడా ఇలా జరిగిందంటే ఏదో ప్లాన్ ఉన్నట్టేగా. అక్కడలా ఉంటే మనదగ్గర ఇంకోలా సాగుతోంది వ్యవహారం. లాల్ సింగ్ లో నాగ చైతన్య ఉన్నాడు కదా మంచి రిలీజ్ ఇస్తే వసూళ్లు బాగుంటాయని ఆశించిన నిర్మాతలకు సౌత్ లోనూ తిప్పలు తప్పేలా లేవు. 11న విక్రమ్ కోబ్రా తమిళనాడులో అధిక థియేటర్లను ఆక్రమించేస్తాడు.

తెలుగులోనూ చెప్పుకోదగ్గ కౌంట్ ఉంటుంది. కేవలం ఒక రోజు గ్యాప్ తో 12న నితిన్ మాచర్ల నియోజకవర్గం, సమంత యశోద, విశాల్ లాఠీ బాక్సాఫీస్ వద్ద తలపడుతున్నాయి. వీటికి స్క్రీన్లు అలాట్ చేయడమే డిస్ట్రిబ్యూటర్లకు పెద్ద చిక్కు. ఇవి చాలవన్నట్టు బెల్లంకొండ గణేష్ ని హీరోగా పరిచయం చేస్తున్న స్వాతిముత్యంకి ఆగస్ట్ 13 లాక్ చేశారు.

సితార సంస్థ కావడంతో ఎగ్జిబిటర్లతో ఇబ్బందేమీ ఉండదు. ఇన్నేసి బాక్సాఫీస్ వద్ద కొట్టుకోవడానికి కారణం ఒకటే. నాలుగు రోజులు సెలవులు రాబోతున్న ఇండిపెండెన్స్ డే లాంగ్ వీకెండ్. భారీ వసూళ్లకు అవకాశం ఉంటుంది. కలెక్షన్లు బాగుంటాయి. ఇంకా నయం ఏజెంట్ డ్రాప్ అయ్యాడు కాబట్టి సరిపోయింది. లేదంటే సీన్ ఇంకా కఠినంగా ఉండేది. మరి ప్రేక్షకుడు వీటిలో ఎన్నింటికి జై కొడతాడో చూడాలి.