చంద్రముఖి 2కి నాగవల్లి కనెక్షన్

నిన్న లారెన్స్ హీరోగా రూపొందబోయే చంద్రముఖి 2 తాలూకు అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. సుమారు ఏడాది క్రితం రజినీకాంత్ తోనే ఈ సీక్వెల్ తీస్తారనే ప్రచారం జరిగింది కానీ తర్వాత సూపర్ స్టార్ దీని మీద పెద్దగా ఆసక్తి చూపించలేదని చెన్నై టాక్. ఇప్పుడీ రెండో భాగానికి పి వాసునే దర్శకుడిగా వ్యవహరించబోతున్నారు. లైకా ప్రొడక్షన్స్ కాబట్టి బడ్జెట్ భారీగా పెడతారు. అందులోనూ దెయ్యాల సినిమాలతో మాస్ లో పెద్ద ఇమేజ్ తెచ్చుకున్న లారెన్స్ కథానాయకుడంటే బిజినెస్ పరంగానూ ప్లస్ అవుతుంది.

ఇక్కడే కొన్ని ట్విస్టులు ఉన్నాయి. చంద్రముఖికి సీక్వెల్ పి వాసు గతంలోనే తీశారు. కన్నడలో విష్ణువర్ధన్ తో 2010లో ఆప్త రక్షక పేరుతో ఇది రూపొందింది. పెద్ద హిట్టు కూడా. దాన్నే తెలుగులో అదే డైరెక్టర్ తో వెంకటేష్ ఏరికోరి మరీ నాగవల్లిగా అదే ఏడాది తెలుగులో రీమేక్ చేయించుకున్నారు. చంద్రముఖి కథనే తిప్పి తిప్పి కొద్దిపాటి మార్పులతో మళ్ళీ తీసినట్టు అనిపించడంతో మన ఆడియన్స్ తిరస్కరించారు. దాని తర్వాత మూడో పార్ట్ గురించి ఎలాంటి ఊసు లేదు. మళ్ళీ పన్నెండేళ్ల తర్వాత చంద్రముఖి 2 ముందుకొస్తోంది.

అయితే వాసు తమిళంలో ఫ్రెష్ గా కొత్త సబ్జెక్టు రాసుకున్నారా లేక కొంపదీసి నాగవల్లినే తీస్తారానే డౌట్ లారెన్స్ అభిమానుల్లో మొదలయ్యింది. బహుశా అలా చేయకపోవచ్చు. ఎందుకంటే దీని రెండు సినిమాల డబ్బింగ్ వెర్షన్లు ఆల్రెడీ జనం టీవీలోనో యుట్యూబ్ లోనో చూసేశారు. పైగా ఇంత గ్యాప్ తర్వాత అదే తీస్తే ఫ్లాప్ అయ్యే ప్రమాదం ఎక్కువ. ఎలాగూ ప్యాన్ ఇండియా అంటూ వివిధ భాషల్లో తీసుకొస్తారు కాబట్టి అయ్యుండదనే అంటున్నారు. అన్నట్టు ఈ చంద్రముఖి 2కి సంగీత దర్శకులు కీరవాణి కావడం మరో ట్విస్ట్.