ఆ సంచ‌ల‌నానికి.. అత‌డి ప్ర‌యాణానికి.. 20 ఏళ్లు

యువ క‌థానాయ‌కుడు నితిన్‌ను చూస్తే ఇంకా కుర్రాడిలాగే క‌నిపిస్తాడు. కానీ అప్పుడే అత‌ను టాలీవుడ్లో 20 ఏళ్ల ప్ర‌స్థానాన్ని పూర్తి చేసుకోవ‌డం విశేషం. అత‌ను సినీ రంగంలోకి అడుగు పెట్టింది 2002లో. అప్ప‌ట్లో ఇండ‌స్ట్రీలో సంచ‌ల‌నం రేపిన జ‌యం సినిమాతో నితిన్ హీరోగా ప‌రిచ‌యం అయ్యాడు. ఆ చిత్రం 2002 జూన్ 14న విడుద‌లైంది. అప్ప‌టికే చిత్రం, నువ్వు నేను సినిమాల‌తో సెన్సేష‌న్ క్రియేట్ చేశాడు ద‌ర్శ‌కుడు తేజ‌.

చిత్రం త‌ర్వాత ఫ్యామిలీ స‌ర్క‌స్ తుస్సుమ‌నిపించినా.. నువ్వు నేనుతో బ‌లంగా బౌన్స్ బ్యాక్ కావ‌డంతో ఆయ‌న కొత్త చిత్రం జ‌యం మీద మంచి అంచ‌నాలు ఏర్పాడ్డాయి. దీనికి తోడు ఆడియో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ట‌యింది. దీంతో జ‌యం మూవీకి మంచి హైప్ వ‌చ్చింది. ఇక రిలీజ్ త‌ర్వాత జ‌యం సంచ‌ల‌నాల గురించి ఎంత చెప్పినా త‌క్కువే. అప్ప‌టి యువ‌త‌కు పిచ్చెక్కించేసిన జ‌యం టాప్ స్టార్ల సినిమాల త‌ర‌హాలో వారాల తర‌బ‌డి హౌస్ ఫుల్స్‌తో ర‌న్ అయింది. చిన్న చిన్న సెంట‌ర్ల‌లో కూడా ఐదారు వారాల త‌ర్వాత టికెట్లు దొర‌క‌ని ప‌రిస్థితి ఉందంటే ఆ సినిమా ఎలా ఆడిందో అర్థం చేసుకోవ‌చ్చు.

పెద్ద హీరోల సినిమాలైతే రికార్డుల గురించి అభిమానులు ఊద‌ర‌గొట్టేసేవాళ్లు. కానీ ఇది కొత్త హీరో హీరోయిన్లతో చేసిన సినిమా కావ‌డంతో అలాంటి హ‌డావుడి ఏమీ లేక‌పోయింది. సినిమా వ‌సూళ్ల మోత మోగిస్తూ వంద రోజుల వైపు పరుగులు తీసింది. అప్ప‌ట్లో రిలీజైన ప్ర‌తి మేజ‌ర్ సెంట‌ర్లోనూ ఈ చిత్రం వంద రోజులు ఆడింది. ఆ త‌ర్వాత కూడా ర‌న్ కొన‌సాగించింది. చాలా త‌క్కువ పెట్టుబ‌డితో, నామ‌మాత్రపు పారితోష‌కాల‌తో ఈ సినిమా తీసిన ద‌ర్శ‌క నిర్మాత తేజ‌.. త‌న జీవిత కాలానికి స‌రిప‌డా డ‌బ్బులు సంపాదించాడు. ఆయ‌న ఆ త‌ర్వాత సొంత బేన‌ర్లో వ‌రుస‌గా ఫ్లాపులు తీసినా ఇప్ప‌టికీ ఇండ‌స్ట్రీలో నిల‌బ‌డ్డాడంటే జ‌యం సినిమాతో సంపాదించిన డ‌బ్బులే కార‌ణం.

తేజ సినిమాతో తన కొడుకు హీరోగా ప‌రిచయం కావ‌డ‌మే అదృష్టం అనుకున్న సుధాక‌ర్ రెడ్డి పైసా పారితోష‌కం ఆశించ‌లేదు. పైగా ఆయ‌న ఈ సినిమా కోసం కొంత ఫైనాన్స్ కూడా చేశాడంటారు. తొలి సినిమాతో నితిన్ న‌ట‌న ప‌రంగా అద‌ర‌గొట్టేశాడు అన‌లేం కానీ.. పాత్ర‌కు త‌గ్గ‌ట్లుగా క‌నిపించి, న‌టించి మంచి మార్కులే వేయించుకున్నాడు. ఆపై దిల్, సై లాంటి హిట్ల‌తో స్టార్ ఇమేజ్ సంపాదించాడు. కానీ త‌ర్వాత వ‌రుస‌గా రెండంకెల సంఖ్య‌లో ఫ్లాపులు తిన్న‌ప్ప‌టికీ.. ప‌ట్టువ‌ద‌ల‌కుండా పోరాడిన నితిన్.. ఇష్క్ మూవీతో మ‌ళ్లీ ట్రాక్ ఎక్కాడు. త‌ర్వాత కొన్ని హిట్లు, ఫ్లాపుల‌తో అత‌డి ప్ర‌యాణం సాగుతోంది. జ‌యం సినిమాకు, ఇండ‌స్ట్రీలో త‌న ప్ర‌యాణానికి 20 ఏళ్లు పూర్త‌యిన నేప‌థ్యంలో ప్రేక్షకుల‌కు, ద‌ర్శ‌కుడు తేజ‌కు థ్యాంక్స్ చెబుతూ ఒక ఎమోష‌న‌ల్ స్టేట్మెంట్ రిలీజ్ చేశాడు నితిన్.