బ్రహ్మాస్త్రను బెంబేలెత్తిస్తున్నన ఆ ఫలితం

బ్రహ్మాస్త్ర.. బాలీవుడ్లో తెరకెక్కిన భారీ చిత్రం. అక్కడి అగ్ర నిర్మాతల్లో ఒకడైన కరణ్ జోహార్ నిర్మించిన ఈ సినిమాను ‘ఏ జవానీ హై దివానీ’ చిత్ర దర్శకుడు అయాన్ ముఖర్జీ రూపొందించాడు. ‘బాహుబలి’ తరహా సౌత్ భారీ చిత్రాలకు ఇది బాలీవుడ్ సమాధానంగా భావిస్తున్నారు. ఈ చిత్రాన్ని రెండు మూడు భాగాలుగా తీయడానికి ప్లాన్ చేసుకున్నారు. ఐదారేళ్ల కిందట ఈ సినిమాకు సన్నాహాలు మొదలయ్యాయి. స్క్రిప్టు వర్క్ సుదీర్ఘంగా సాగింది. మేకింగ్ పరంగానూ బాగా టైం తీసుకున్నారు. బడ్జెట్ వందల కోట్లలోనే పెట్టారు.

కేవలం హిందీకి పరిమితం చేయకుండా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడల్లోనూ ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ఇతర భాషల్లో ఏదో మొక్కుబడిగా రిలీజ్ చేయడం కాకుండా.. రాజమౌళిని సమర్పకుడిని చేయడం, చిరంజీవితో వాయిస్ ఓవర్ చెప్పించడం, ఇక్కడ ప్రత్యేక ప్రమోషనల్ కార్యక్రమాలు చేయడం.. ఇలా ఒక ప్రణాళిక ప్రకారమే అడుగులు వేస్తున్నారు. నాగార్జున ఓ కీలక పాత్ర చేయడం కూడా సౌత్‌లో కలిసొస్తుందని భావిస్తున్నారు. కానీ హిందీ చిత్రాలకు నార్త్ మార్కెట్లోనూ షాకుల మీద షాకులు తగులుతుండటం ఈ చిత్రాన్ని భయపెడుతోంది.

కొవిడ్ తర్వాత బాలీవుడ్లో పెద్ద హీరోల సినిమాలు చాలానే బోల్తా కొట్టాయి. అందులోనూ పృథ్వీరాజ్ లాంటి భారీ చిత్రానికి ఇటీవల వచ్చిన పలితం ‘బ్రహ్మాస్త్ర’ను బెంబేలెత్తించేదే. ఇంతకుముందులా బాలీవుడ్ స్టార్లు, డైరెక్టర్లు ఏం తీసినా కళ్లు మూసుకుని హిందీ ప్రేక్షకులు చూసేసే పరిస్థితి లేదు. సౌత్ మాస్ మసాలా, యాక్షన్, భారీ చిత్రాలకు వాళ్లు బ్రహ్మరథం పడుతూ.. క్లాస్‌గా, సటిల్‌గా సాగే హిందీ చిత్రాలను తిరస్కరిస్తున్నారు. మారిన ప్రేక్షకుల అభిరుచిని హిందీ ఫిలిం మేకర్స్ అర్థం చేసుకోలేకపోతున్నారు. తమ శైలికి భిన్నంగా సినిమాలు తీయలేకపోతున్నారు. ‘బ్రహ్మాస్త్ర’ను ఎంత భారీగా తీసినా, కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా.. ‘పృథ్వీరాజ్’ లాంటి సినిమాల ఫలితాలు చూశాక మాత్రం చిత్ర బృందాన్ని భయం వెంటాడుతూ ఉంటుందనడంలో సందేహం లేదు.