హిట్ కొడితే గొప్పనుకుంటే.. రికార్డులు కొడుతున్నాడు

ఒకప్పుడు తమిళంతో పాటు తెలుగులో, హిందీలో బ్లాక్‌బస్టర్లు ఇచ్చి మొత్తం ఇండియాలోనే టాప్ హీరోల్లో ఒకడిగా ఉండేవాడు కమల్ హాసన్. ఇప్పుడు అందరూ ఊదరగొట్టేస్తున్న ‘పాన్ ఇండియా’ స్టార్ స్టేటస్‌ను కమల్ దశాబ్దాల కిందట అందుకున్నాడు. ఐతే గత రెండు దశాబ్దాల్లో ఆయన జోరు బాగా తగ్గిపోయింది. దశావతారం, విశ్వరూపం మినహాయిస్తే బాక్సాఫీస్ దగ్గర సందడి చేసిన కమల్ చిత్రాలు అంతగా కనిపించవు. దీంతో ఆయన తమిళ టాప్ స్టార్ల లిస్టులోంచి అనధికారికంగా బయటికి వచ్చేశాడు.

కమల్ చివరి సినిమా విశ్వరూపం-2, అంతకుముందు వచ్చిన ఉత్తమ విలన్ పెద్దగా ప్రభావం చూపలేదు. కొంచెం గ్యాప్ తర్వాత చేసిన క్రేజీ ఫిలిం ‘ఇండియన్-2’ మధ్యలో ఆగిపోవడంతో కమల్ క్రేజ్ ఇంకా పడిపోయింది. అదిరిపోయే కాంబినేషన్లో ‘విక్రమ్’ సినిమా చేసినా.. బాక్సాఫీస్ దగ్గర కమల్ సత్తా చూపగలడా అనే విషయంలో చాలామంది సందేహాలు వ్యక్తం చేశారు.

కమల్ మహా అయితే ఈ సినిమాతో హిట్టు కొడితే ఎక్కువ అనుకున్నారంతా. కానీ కమల్ హిట్టు కాదు.. బ్లాక్‌బస్టర్ కొట్టి.. రికార్డుల భరతం పట్టే పనిలో పడ్డాడు. ఈ చిత్రం తమిళంలో ఆల్ టైం హైయెస్ట్ గ్రాసర్‌గా నిలిచే దిశగా పరుగులు పెడుతోంది. ఇప్పటికే ‘ఆర్ఆర్ఆర్’ను దాటేసి ఈ ఏడాది తమిళంలో అత్యధిక వసూళ్లు సాధించిన మూడో చిత్రంగా నిలిచింది ‘విక్రమ్’. వలిమై, కేజీఎఫ్-2 ముందున్నాయి. వీటిని దాటి.. ‘బాహుబలి-2’ పేరిట ఉన్న తమిళనాడు ఆల్ టైం హైయెస్ట్ గ్రాసర్‌ రికార్డును ఫుల్ రన్లో దాటేయడం లాంఛనమే కావచ్చు.

మొత్తంగా ఈ చిత్ర గ్రాస్ వసూళ్లు రూ.300 కోట్ల గ్రాస్ మార్కుకు చేరువగా ఉన్నాయి. రెండో వారంలోనూ స్ట్రాంగ్‌‌గా నిలబడ్డ ‘విక్రమ్’ ఫుల్ రన్లో సునాయాసంగా రూ.400 కోట్ల మార్కును దాటేస్తుందని అంచనా. అదే జరిగితే తమిళంలో ఆల్ టైం రికార్డులన్నీ బద్దలు కావడం లాంఛనమే.