వరసగా రెండు రీమేకులు వకీల్ సాబ్, భీమ్లా నాయక్ లు చేశాక పవన్ కళ్యాణ్ ఇకపై స్ట్రెయిట్ సినిమాలు చేస్తారేమో అని ఎదురుచూస్తున్న అభిమానుల కోరిక నెరవేరేలా లేదు. నాలుగు నెలల క్రితం హఠాత్తుగా వార్తల్లోకి వచ్చిన వినోదయ సితం రీమేక్ త్వరగానే మొదలు పెట్టబోతున్నారని ఫిలిం నగర్ టాక్. ఇందుకుగాను పవన్ ఇరవై రోజుల కాల్ షీట్లతోనే వేగంగా పూర్తి చేసేలా దర్శకుడు సముతిరఖనిని ముందుగానే ప్రిపేర్ అవ్వమని చెప్పారట. అంటే సెప్టెంబర్ లోపే పూర్తి చేసేలా కానిచ్చేస్తారన్న మాట.
బయటికి చెప్పకపోయినా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని వినికిడి. ఇందులో సాయి తేజ్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. తనకు హీరోయిన్ ఉంటుంది. కృతి శెట్టి లేదా శ్రీలీల ఇద్దరిలో ఒకరిని ఫైనల్ చేసే పనిలో టీమ్ ఉందట. పవన్ పాత్రకు గోపాల గోపాల టైపులో ఎలాంటి జోడి ఉండదు. మహా అయితే పాటలు పెట్టొచ్చు కానీ డ్యూయెట్లకు ఛాన్స్ లేదు. సబ్జెక్టు అలాంటిది. రచన త్రివిక్రమే చేశారా లేక ఆ బాధ్యతను ఇంకెవరైనా తీసుకున్నారా అనేది బయటికి చెప్పకుండా సస్పెన్స్ కొనసాగిస్తున్నారు.
అసలు ఈ వినోదయ సితం అనేది ఓటిటి మూవీ. థియేటర్లలో రాలేదు. ఇప్పుడు పవన్ చేయబోయే పాత్రను ఒరిజినల్ వెర్షన్ లో సముతిరఖని వేశారు. సాయితేజ్ క్యారెక్టర్ ని సపోర్టింగ్ రోల్స్ వేసే తంబి రామయ్యకి ఇచ్చారు. తమిళంలో దీని నిడివి కేవలం 95 నిముషాలు. కానీ థియేటర్ కు అందులోనూ మామ అల్లుడి కాంబోకు అంత లెన్త్ సరిపోదు. చాలా హంగులను జోడించాల్సి ఉంటుంది. మొత్తానికి హరిహర వీరమల్లు, భవదీయుడు భగత్ సింగ్ సంగతి తేలకుండానే వినోదయసితం మళ్ళీ వెలుగులోకి వచ్చేసింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates