ఆ పేజీలు ఎప్పుడు తెరుస్తారు

అంగట్లో అన్ని ఉన్నా అదేదో శని కూర్చుందని సామెత చెప్పినట్టు కొన్ని సినిమాలకు అన్ని అమరినట్టు అనిపించినా విడుదల కావడానికి మాత్రం బోలెడు సమయం తీసుకుంటాయి. అందులో నిఖిల్ 18 పేజెస్ ఒకటి. సుకుమార్ రచన, గీత ఆర్ట్స్ 2 బ్యానర్, ప్రేమ కథ చిత్రమ్ లాంటి సక్సెస్ ఫుల్ మూవీ దర్శకుడు సూర్యప్రతాప్, బన్నీవాస్ నిర్మాణం, గోపిసుందర్ సంగీతం, నిఖిల్ అనుపమ పరమేశ్వరన్ లాంటి లవ్లీ కాంబినేషన్. ఇన్నేసి పాజిటివ్ అంశాలు పుష్కలంగా ఉన్నాయి కానీ రిలీజ్ మాత్రం తెమలడం లేదు.

దీనికన్నా ఆలస్యంగా మొదలైన కార్తికేయ 2 జూలైలో విడుదలైపోతోంది. ఆ మేరకు పోస్టర్లు, టీజర్లు, పాత్రల పరిచయాలు అన్నీ జరిగిపోతున్నాయి. తనకు బాగా పేరు తెచ్చిన సినిమాకు సీక్వెల్ కావడంతో నిఖిల్ దీని మీద చాలా నమ్మకంతో ఉన్నాడు. కథ నచ్చితే తప్ప ఇతర భాషల్లో నటించేందుకు ఒప్పుకోని బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ అనుపమ్ ఖేర్ ఇందులో ఒక కీలక పాత్ర చేస్తున్నారు. ప్రభాస్ ప్రాజెక్ట్ కె కన్నా ముందు ఆయన ఒప్పుకున్న తెలుగు స్ట్రెయిట్ సినిమా ఇదొక్కటే. చందూ మొండేటి దర్శకత్వం గురించి తెలిసిందే

అసలు 18 పేజెస్ ఎందుకు ఆలస్యమవుతోందో అంతు చిక్కడం లేదు. అర్జున్ సురవరం సక్సెస్ తర్వాత నిఖిల్ కు చాలా గ్యాప్ వచ్చింది. ఈ సినిమా కూడా కరోనా వల్ల బ్రేకులు పడుతూ ఎట్టకేలకు ఫినిష్ అయ్యింది. రెండు నెలల క్రితం టీజర్ రిలీజ్ చేస్తే రెస్పాన్స్ భారీగానే ఉంది. అయినా కూడా దీనికి మోక్షం కలిగించడంలో ఆలస్యం చేస్తున్నారు. థియేటరా ఓటిటినా అనే క్లారిటీ ఇవ్వడంలోనూ జాప్యం జరుగుతోంది. కార్తికేయ 2లో నటించిన అనుపమ పరమేశ్వరనే ఇందులోనూ హీరోయిన్ కావడం కొసమెరుపు.