కుర్ర హీరో.. నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్

యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ చాన్నాళ్ల నుంచి థియేట్రిక‌ల్ రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నాడు. చివ‌ర‌గా 2019లో అత‌ను అర్జున్ సుర‌వ‌రంతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు. ఆ సినిమా కూడా వాయిదాల మీద వాయిదాలు ప‌డి ఆల‌స్యంగా విడుద‌లైంది. అయిన‌ప్ప‌టికీ ఆడియ‌న్స్ నుంచి మంచి స్పంద‌నే తెచ్చుకుంది. ఆ త‌ర్వాత క‌రోనా, ఇత‌ర కార‌ణాల వ‌ల్ల మూడేళ్లుగా నిఖిల్‌కు థియేట్రిక‌ల్ రిలీజ్ లేదు. సుకుమార్ ప్రొడ‌క్ష‌న్లో ఆయ‌న శిష్యుడు ప‌ల్నాటి సూర్య‌ప్ర‌తాప్ రూపొందించిన 18 పేజెస్ ఎప్పుడో పూర్త‌యినా విడుద‌ల ఆల‌స్యం అవుతోంది. సుక్కు క‌థ‌తో ఆయ‌న శిష్యుడు తీసిన సినిమా కాబ‌ట్టి కుమారి 21 ఎఫ్ టైపులో ఇది మ్యాజిక్ చేస్తుంద‌నే ఆశ‌తో ఉన్నాడు నిఖిల్. ఐతే ఇది తెలుగు వ‌ర‌కు జ‌స్ట్ స‌క్సెస్ అయితే చాల‌న్న‌ది ఉద్దేశం. నిఖిల్ ఫోక‌స్ మాత్రం వేరే రెండు చిత్రాల మీద ఉంది. కెరీర్లో వ‌చ్చిన గ్యాప్ మొత్తాన్ని క‌వ‌ర్ చేసేలా, త‌న కెరీర్‌ను మ‌రో స్థాయికి తీసుకెళ్లేలా ఆ రెండు చిత్రాల‌ను ప్లాన్ చేసుకున్నాడు నిఖిల్.

ఆ రెండు చిత్రాలే.. కార్తికేయ‌-2, స్పై. ఇవి రెండూ పాన్ ఇండియా సినిమాలు కావ‌డం విశేషం. కార్తికేయ‌-2 మీద నిఖిల్ ఎక్కువ ఆశ‌లు పెట్టుకోవ‌డానికి కార‌ణాలు లేక‌పోలేదు. కార్తికేయ నిఖిల్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్. ఆ చిత్రం హిందీలోకి అనువాద‌మై ఉత్త‌రాది ప్రేక్ష‌కుల‌ను యూట్యూబ్‌లో అమితంగా ఆక‌ట్టుకుంది. నిఖిల్‌కు అక్క‌డ మంచి పాపులారిటీ తెచ్చిపెట్టింది. ఈ సినిమా క‌థాంశం ప్ర‌కారం చూస్తే పాన్ ఇండియా లెవెల్లో వ‌ర్క‌వుట్ అయ్యే ఛాన్సులున్నాయి. కార్తికేయ‌కు కొన‌సాగింపులా కాకుండా దాన్ని మించిన భారీ క‌థ‌తో, పెద్ద బ‌డ్జెట్లో, వేరే లెవెల్లో ఈ సినిమా తీశారు. అందుకే సినిమా ఆల‌స్యం అయినా ఓపిక‌తో ఉన్నారు. క్వాలిటీ విష‌యంలో అస్స‌లు రాజీ ప‌డట్లేదు. ద‌ర్శ‌కుడు చందు మొండేటి కూడా ఈ సినిమాతో బ‌లంగా బౌన్స్ బ్యాక్ అవ్వాల‌ని చూస్తున్నాడు.

ఈ సినిమాతో త‌న ఇమేజ్ మారుతుంద‌ని ఆశిస్తున్న నిఖిల్.. దాని త‌ర్వాత స్పై రూపంలో ఇంకో పాన్ ఇండియా మూవీని లైన్లో పెట్టాడు. తాజాగా రిలీజైన దీని గ్లింప్స్ చూస్తే ఇది కూడా పెద్ద బ‌డ్జెట్లో, పాన్ ఇండియా అప్పీల్‌తో తెర‌కెక్కుతున్న సినిమాలా క‌నిపిస్తోంది. కార్తికేయ‌-2 స‌క్సెస్ అయి, స్పై కూడా అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్లు ఉంటే నిఖిల్ కెరీర్ క‌చ్చితంగా నెక్స్ట్ లెవెల్‌కు వెళ్తుంద‌న‌డంలో సందేహం లేదు.