భవదీయడు ఆలస్యానికి బాధ్యులెవరు

హరిహరవీరమల్లు తర్వాత పవన్ కళ్యాణ్ చేయాల్సిన భవదీయడు భగత్ సింగ్ ఎప్పుడు మొదలువుతుందో అంతు చిక్కడం లేదు. దర్శకుడు హరీష్ శంకర్ స్క్రిప్ట్ తో రెడీగా ఉన్నాడు. ప్రీ ప్రొడక్షన్ పనులు ఒక కొలిక్కి వచ్చాయి. హీరోయిన్ గా ఎంపికైన పూజా హెగ్డే కాల్ షీట్ల సమస్య వల్ల ఆల్రెడీ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుందన్న వార్తలు అనఫీషియల్ గా చక్కర్లు కొడుతున్నాయి. నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ దీనికి సంబంధించిన ఎలాంటి అప్ డేట్స్ ఇవ్వడం లేదు. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ మౌనం సరేసరి.

అసలేం జరుగుతోందన్న అనుమానం పవన్ ఫ్యాన్స్ ని పీడిస్తోంది. నిజానికి వీరమల్లు షూటింగ్ పూర్తయితే కానీ దీన్ని స్టార్ట్ చేయలేరు. దానికేవో స్క్రిప్ట్ ఇష్యూస్ వచ్చాయని, దర్శకుడు క్రిష్ తో పవన్ కు కొన్ని అభిప్రాయభేదాలు ఉన్నాయని ఏదేదో ప్రచారం జరుగుతోంది. దానికి తోడు షూటింగ్ రెగ్యులర్ గా జరగడం లేదు. ఆ మధ్య కొంత చేసి మళ్ళీ బ్రేక్ ఇచ్చారు. ఈలోగా పవన్ జనసేన తరఫున రైతుల ఓదార్పు యాత్రలు, వాళ్లకు పరిహారాలు అందజేసే కార్యక్రమాలతో చాలా బిజీ అయ్యారు. ఎప్పుడు ఫ్రీనో తెలియదు.

ఇవి చాలవన్నట్టు వినోదయ సితం రీమేక్ ని ఫిక్స్ చేసుకోవడం భవదీయుడికి మరో అడ్డంకి. అలా అని అదీ వెంటనే స్టార్ట్ చేయడం లేదు. ఈ ప్రాజెక్టు వెనుక త్రివిక్రమ్ ప్రమేయం ఉందని, త్వరగా సినిమాలు చేయించడం కోసం పవర్ స్టార్ ని రీమేకులకు ఒప్పిస్తున్నాడని టాక్ ఉంది. ఇది నిజమో కాదో కానీ పవర్ స్టార్ అభిమానులు మాత్రం గబ్బర్ సింగ్ కాంబినేషన్ కోసమే ఎదురు చూస్తున్నారు. అందులోనూ పవర్ ఫుల్ టైటిల్ తో ఫస్ట్ లుక్ తోనే అంచనాలు పెంచేసిన భవదీయడు భగత్ సింగ్ మీద వాళ్ళ గురి ఉంది. వాస్తవ పరిస్థితేమో దానికి భిన్నంగా ఉంది. అసలు ఏది ముందు మొదలవుతుందో కూడా ఎవరూ చెప్పలేని అయోమయమిది.