టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా అగ్ర సింహాసనాన్ని ఎంజాయ్ చేస్తున్న పూజా హెగ్డే డిమాండ్ మాములుగా లేదు. ఈ ఏడాదిలో వరసగా మూడు డిజాస్టర్లు రాధే శ్యామ్, బీస్ట్, ఆచార్యలు పలకరించినప్పటికీ తనకొస్తున్న ఆఫర్లకు లోటేమీ లేదు. ఒకపక్క మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్, మరోపక్క విజయ్ దేవరకొండ లాంటి రౌడీ ఐకాన్ లతో జట్టు కట్టే అవకాశాలు వస్తున్నప్పుడు కెరీర్ కు ఎలాంటి ఢోకా ఉండదు.
పైగా సల్మాన్ ఖాన్ సరసన కభీ ఈద్ కభీ దివాలిలో ఛాన్స్ కొట్టేయడం అంటే జాక్ పాట్ అనే పదం చిన్నదే అవుతుంది. ఇక పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో రూపొందబోయే భవదీయుడు భగత్ సింగ్ లో హీరోయిన్ గా పూజా హెగ్డేనే తొలుత ఎంపికయ్యింది. అఫీషియల్ గా యూనిట్ ప్రకటించకపోయినా పలు సందర్భాల్లో దర్శకుడే ఇన్ డైరెక్ట్ గా చెప్పాడు. అందులోనూ డిజె రూపంలో తనకు బ్రేక్ ఇచ్చిన దర్శకుడు, మొదటిసారి పవర్ స్టార్ కాంబినేషన్ కావడంతో పూజా కూడా ఉత్సాహంగానే ఉంది.
కానీ లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ ప్రాజెక్టుని తను వదులుకున్నట్టు తెలిసింది. ఇష్టం లేకపోయినా తప్పని పరిస్థితిలో నిర్ణయం తీసుకుందట. కారణాలు లేకపోలేదు. భవదీయుడు భగత్ సింగ్ ప్రకటించి నెలలు గడిచిపోతోంది. రెగ్యులర్ షూటింగ్ మొదలుకాలేదు.
హరిహర వీర మల్లేమో నెమ్మదిగా సాగుతోంది. ఎప్పుడు పూర్తి చేస్తారో తెలియదు. ఈలోగా వినోదయ సితం రీమేక్ తెరపైకొచ్చింది. పోనీ ఇదీ స్టార్ట్ చేశారా అంటే అదీ లేదు. దీన్ని డైరెక్ట్ చేయాల్సిన సముతిరఖని కొంత కాలం వెయిట్ చేసి ఆర్టిస్ట్ గా తన డేట్స్ ని ఇతరులకు ఇచ్చేస్తున్నాడు. ఇవి కాకుండా జనసేన కార్యకలాపాలు, ప్రజా యాత్రలతో పవన్ షెడ్యూల్ టైట్ అయిపోతోంది. ఈ నేపథ్యంలో ఇలా నెలల తరబడి వెయిట్ చేయడం పూజా హెగ్డేకు ఇబ్బంది కలిగించేదే. అందుకే సైలెంట్ గా తప్పుకుందని వినికిడి.
Gulte Telugu Telugu Political and Movie News Updates