గత వారాంతంలో విడుదలైన ఎఫ్-3 సినిమాను మెచ్చిన వాళ్లున్నారు. అదే సమయంలో ఆ సినిమాను తీవ్రంగా విమర్శించిన వాళ్లూ ఉన్నారు. కానీ డివైడ్ టాక్‌ను తట్టుకుని ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బాగానే నిలబడింది. వారాంతంలో రూ.30 కోట్లకు పైగానే షేర్ రాబట్టి ఆశ్చర్యపరిచింది. ఈ సినిమా స్థాయిలో ఇవి చాలా మెరుగైన వసూళ్లే. ‘ఎఫ్-2’ బ్రాండ్ ఈ సినిమాకు బాగా పని చేసినట్లు అర్థమవుతోంది. చాన్నాళ్లుగా సరైన ఫ్యామిలీ సినిమా లేకపోవడంతో ఆ వర్గం ప్రేక్షకులు థియేటర్లకు పెద్ద ఎత్తున తరలిరావడం ‘ఎఫ్-3’కి కలిసొచ్చింది.
ఐతే ‘ఎఫ్-3’ తరహా స్లాప్ స్టిక్ కామెడీలు మామూలుగా యుఎస్‌లో అంత బాగా ఆడవు. అక్కడి ప్రేక్షకులు క్లాస్ టచ్ ఉన్న వినోదాత్మక చిత్రాలకు పట్టం పడుతుంటారు. ‘ఎఫ్-2’ అక్కడ బాగానే ఆడినప్పటికీ.. దానికి పోటీగా సంక్రాంతి టైంలో వచ్చిన సినిమాలు పూర్తిగా ఫెయిలవడం కలిసొచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా అందుకే ఆ చిత్రం పెద్ద హిట్టయింది. కానీ కొవిడ్ తర్వాత బాక్సాఫీస్ పరిస్థితులు పూర్తిగా మారిపోయి.. ఇక్కడి వాళ్లే కాక యుఎస్ ప్రేక్షకులు కూడా సెలెక్టివ్‌గా సినిమాలు చూస్తున్నారు. అక్కడ అన్ని సినిమాలకూ ఓపెనింగ్స్ వచ్చేయట్లేదు.
‘ఎఫ్-3’కి అడ్వాన్స్ బుకింగ్స్ యుఎస్‌లో ఆశించిన స్థాయిలో ఏమీ కనిపించలేదు. ప్రిమియర్లతో ఈ చిత్రం 2.5 లక్షల డాలర్లే వసూలు చేసింది. ఇది అక్కడ స్లో స్టార్ట్ అన్నట్లే. దీనికి తోడు టాక్ మరీ గొప్పగా ఏమీ లేకపోవడంతో ‘ఎఫ్-3’ ఫుల్ రన్లో మిలియన్ మార్కును దాటడం కష్టమే అన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ అంచనాలను తలకిందులు చేస్తూ ఈ సినిమా అక్కడ అదరగొడుతోంది.
వీకెండ్ అయ్యేసరికే మిలియన్ మార్కుకు చేరువ అయిన ఈ చిత్రం.. సోమవారం సెలవు కలిసి రావడంతో మ్యాజిక్ మార్కును దాటేసింది. ఇలాంటి స్లాప్ స్టిక్ కామెడీ మూవీ అక్కడ ఇంత వేగంగా మిలియన్ మార్కును అందుకోవడం విశేషమే. మంగళవారం ఆఫర్లుంటాయి కాబట్టి.. ఈ రోజు కూడా సినిమాకు చెప్పుకోదగ్గ వసూళ్లే రావచ్చు. బుధవారం నుంచి సినిమా ఎలా పెర్ఫామ్ చేస్తుందన్నదే చూడాలి.