మహేష్ విలన్‌గా నందమూరి నటుడు?

ఇది నిజంగా ఈ రోజుకు క్రేజీయెస్ట్ న్యూసే. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించబోయే కొత్త సినిమాలో అతడికి దీటుగా నిలిచే ఓ బలమైన విలన్ కోసం త్రివిక్రమ్ వెతుకుతున్నట్లు కొన్ని రోజుల కిందటే వార్తలు రాగా.. ఇప్పుడా చిత్రంలో నందమూరి తారకరత్న ప్రతినాయకుడి పాత్రకు ఎంపికైనట్లుగా జోరుగా ప్రచారం సాగుతుండటం విశేషం. స్వయంగా తారకరత్ననే ఈ విషయాన్ని ధ్రువీకరించినట్లుగా చెబుతున్నారు.

ట్విట్టర్లో అతడి పేరిట ఉన్న అకౌంట్ నుంచి #ssmb28 అనే హ్యాష్ ట్యాగ్‌‌తో ఒక ట్వీట్ పడడమే ఈ ప్రచారానికి కారణం. అది వెరిఫైడ్ హ్యాండిల్ కాకపోయినా.. తారకరత్నదే అంటున్నారు. ఈ న్యూస్ బయటికి వచ్చినప్పటి నుంచి మహేష్ అభిమానుల్లో ఒకరకమైన ఆందోళన కనిపిస్తోంది. అందుక్కారణం తారకరత్న ట్రాక్ రికార్డే.

హీరోగా ఒకేసారి తొమ్మిది చిత్రాల ప్రారంభోత్సవంలో పాల్గొని ‘ఒకడో నంబర్ కుర్రాడు’ సినిమాతో చాలా ఘనంగా అరంగేట్రం చేసిన తారకరత్న.. 20 ఏళ్లలో ఒక్కటంటే ఒక్క సక్సెస్ కూడా అందుకోలేకపోయాడు. ఒక దశ దాటాక అతడి సినిమాలను జనాలు పట్టించుకోవడం మానేశారు. ఏవో చిన్నా చితకా సినిమాలు చేసుకుంటూ బండి లాగిస్తూ వస్తున్నాడు కానీ.. జనాలైతే అతడి గురించి ఆలోచించడం కూడా లేదు. ఇలాంటి దశలో తారకరత్న.. మహేష్ సినిమాలో, అది కూడా విలన్‌గా చేస్తున్నాడనే వార్త సూపర్ స్టార్ అభిమానులను ఉలిక్కి పడేలా చేసింది. మరి ఈ ప్రచారంలో ఎంత వరకు నిజం ఉందో చూడాలి.

హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా తారకరత్న సక్సెస్ అందుకోని మాట వాస్తవమే అయినా.. అతను ఉత్తమ విలన్‌గా ‘అమరావతి’ చిత్రానికి నంది అవార్డు అందుకోవడం గమనార్హం. ఆ చిత్రంలో తారకరత్న బాగానే నటించాడు. ‘రాజా చెయ్యి వేస్తే’ సినిమాలో కూడా అతడి నటన పర్వాలేదనే అనిపిస్తుంది. ఒక నటుడి నుంచి బెస్ట్ పెర్ఫామెన్స్ రాబట్టుకోవడం దర్శకుడి చేతిలోనే ఉంటుంది. ‘అమరావతి’ సినిమాలో రవిబాబు.. తారకరత్న నుంచి ది బెస్ట్ తీసుకున్నాడు. మరి మహేష్ సినిమాలో తారకరత్న నటించడం నిజమే అయితే.. త్రివిక్రమ్ కూడా అతడి నుంచి ఉత్తమ నటన రాబట్టుకుంటాడనే ఆశిద్దాం.