ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని పెద్దోళ్లు ఊరికే అనరు. విజయాలు సాధిస్తున్నపుడు మరీ ఎగిరెగిరి పడితే.. దబేల్‌మని కింద పడడానికి ఎంతో సమయం పట్టదు. క్వీన్, తను వెడ్స్ మను రిటర్న్స్ లాంటి చిత్రాలతో భారీ విజయాలందుకుని, హీరోయిన్లలో వేరెవ్వరికీ సాధ్యం కాని స్టార్ ఇమేజ్ సంపాదించిన కంగనా రనౌత్.. ఆ విజయాల తాలూకు గర్వం తలకెక్కి ఆ తర్వాతి కాలంలో ఎలా ప్రవర్తించిందో అందరికీ తెలుసు.
క్రిష్ లాంటి పేరున్న దర్శకుడిని పక్కన పెట్టి.. మణికర్ణికకు రీషూట్లు చేయడం, దర్శకుడిగా అతడికి ఇవ్వాల్సిన విలువ ఇవ్వకుండా తక్కువ చేసి మాట్లాడటం, అతణ్ని అవమానించేలా స్టేట్మెంట్లు ఇవ్వడం గుర్తుండే ఉంటుంది. అంతే కాక బాలీవుడ్లో చాలామందిని అదే పనిగా టార్గెట్ చేసి కించపరిచేలా మాట్లాడ్డం ద్వారా అనవసర నెగెటివిటీని మూటగట్టుకుంది కంగనా. ఐతే అన్నీ కలిసొస్తున్నపుడు ఏం చేసినా చెల్లుతుంది కానీ.. కలిసి రానపుడే అన్నీ తేడా కొట్టేస్తాయి.
మణికర్ణికకు ముందు, తర్వాత కంగనా డిజాస్టర్ల మీద డిజాస్టర్లు ఎదుర్కొంటోంది. తన స్టార్ పవర్ గురించి, బాక్సాఫీస్ స్టామినా గురించి ఎగిరెగిరి పడ్డ కంగనాకు.. ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర ఎదురవుతున్న పరాభావాలు మామూలు షాక్ కాదు. మణికర్ణిక తర్వాత జడ్జిమెంటల్ హై క్యా, పంగా, తలైవి దారుణమైన ఫలితాలు ఎదుర్కొన్నాయి. తలైవి అయితే ఫుల్ రన్లో రూ.3 కోట్ల వసూళ్లకు పరిమితం అయింది.
ఇప్పుడు ధాకడ్ కంగనాకు ఇంకా పెద్ద షాక్. తలైవి అయినా సౌత్ సినిమా కాబట్టి ఉత్తరాది జనాలు ఆదరించలేదు అనుకోవచ్చు. కానీ ధాకడ్ హిందీ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లే తెరకెక్కిన యాక్షన్ మూవీ. వీకెండ్లో రూ.3 కోట్లు కూడా వసూలు చేయలేకపోయిందీ చిత్రం. ఫుల్ రన్ కలెక్షన్లు రూ.4 కోట్లు దాటేలా లేవు. ఈ సినిమా బడ్జెట్ రూ.100 కోట్లని అంటున్నారు. అంత బడ్జెట్లో తీసిన సినిమాకు బాక్సాఫీస్ దగ్గర రూ.4 కోట్లు కూడా రాలేదంటే ఇది ఏ స్థాయి డిజాస్టరో అర్థం చేసుకోవచ్చు. కంగనాపై బేసిగ్గా పెరిగిపోయిన నెగెటివిటీనే ఇలాంటి ఫలితానికి కారణం అంటున్నారు. ఇప్పటికైనా కంగనా బయట అతి తగ్గించి కొంచెం ఒద్దికగా లేకపోతే మున్ముందు ఆమెకు ఇలాంటి షాకులు మరిన్ని తప్పవని అభిప్రాయపడుతున్నారు విశ్లేషకులు.