విశాల్ చాలా రిస్క్ చేస్తున్నాడు

ఒకప్పుడు విశాల్ కు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉండేది. పందెం కోడి సూపర్ హిట్ అయ్యాక మాస్ లో మినిమమ్ గ్యారెంటీ హీరోగా నిలబడ్డాడు. పొగరు, భరణి లాంటి సినిమాల్లో కంటెంట్ అటుఇటుగా ఉన్నా కమర్షియల్ గా పాస్ అయ్యాయి. ఆ తర్వాత వరస ఫ్లాపులు, సబ్జెక్ట్ సెలక్షన్ లో చేసిన తప్పుల వల్ల టాలీవుడ్ లో క్రమంగా పట్టు కోల్పోయాడు. అభిమన్యుడుతో తిరిగి కం బ్యాక్ అయ్యాడు కానీ తర్వాత చక్రతో కథ మళ్ళీ మొదటికే వచ్చింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న సామాన్యుడు దారుణంగా డిజాస్టర్ కావడం ఊహించనిది.

ఇలాంటి పరిస్థితిలో ఇతని కొత్త సినిమా బజ్ ఆశించడం కష్టమే. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న లాఠీ షూటింగ్ చివరి స్టేజిలో ఉంది. రిలీజ్ డేట్ ని ఆగస్ట్ 12కి లాక్ చేశారు. ఇండిపెండెన్స్ డేని దృష్టిలో లాంగ్ వీకెండ్ కోసం అలా ప్లాన్ చేసుకున్నాడు కానీ ముందు వెనుకా ఏ స్థాయిలో పోటీ ఉందో చెక్ చేసుకున్నట్టు లేదు. 11న లాల్ సింగ్ చద్దా కోసం ఇప్పటికే దేశవ్యాప్తంగా స్క్రీన్ల కేటాయింపు మొదలయ్యింది. ముఖ్యంగా మల్టీప్లెక్సులు దీని మీద చాలా ఆశలు పెట్టుకున్నాయి. అదే రోజు విక్రమ్ నటించిన కోబ్రా మొన్నే లాక్ చేసుకుంది.

ఇవి చాలవన్నట్టు 12న నితిన్ మాచర్ల నియోకవర్గం, సమంతా యశోదలు తగ్గేదేలే అంటున్నాయి. అఖిల్ ఏజెంట్ కూడా ఉంది కానీ దాని వాయిదా ప్రకటించడం ఆల్రెడీ ఫిక్స్ అయ్యింది. ఇన్నేసి క్రేజీ మూవీస్ మధ్య లాఠీకి నార్త్, సౌత్ రెండు చోట్లా స్క్రీన్లు దొరకడం ఇబ్బందికరంగానే ఉంటుంది. అలాంటప్పుడు సేఫ్ గేమ్ ఆడేలా లాఠీకి మరో డేట్ చూసుకుని ఉంటే బాగుండేది. మరి విశాల్ కాన్ఫిడెన్స్ ఏంటో చూడాలి. అన్నట్టు ఈ టైటిల్ గుణశేఖర్ డెబ్యూ మూవీకి వాడింది. మళ్ళీ ఇన్నేళ్లకు విశాల్ తీసుకున్నాడు.