వివాదంలో రాజ‌శేఖ‌ర్ సినిమా


సీనియ‌ర్ హీరో రాజ‌శేఖ‌ర్ ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న సినిమా.. శేఖ‌ర్. మ‌ల‌యాళ హిట్ జోసెఫ్ ఆధారంగా తెర‌కెక్కిన ఈ చిత్రానికి ఆయ‌న భార్య జీవిత ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. శేఖ‌ర్ విడుద‌ల ముంగిట రాజ‌శేఖ‌ర్ మాట్లాడుతూ.. సినిమానే త‌మ‌కు బ‌తుకు తెరువు అని.. ఈ సినిమాను విజ‌య‌వంతం చేసి తాను అప్పుల పాలు కాకుండా చూడాల‌ని ప్రేక్ష‌కుల‌కు విన్న‌వించ‌డం తెలిసిందే. కాగా.. ఈ సినిమాకు ఆశించినంత మంచి టాక్ కానీ, ఓపెనింగ్స్ కానీ రాలేదు. ఇది రాజ‌శేఖ‌ర్, జీవిత‌ల‌కు నిరాశ క‌లిగించే విష‌య‌మే.

ఇదిలా ఉంటే.. ఈ సినిమా కోస‌మ‌ని జీవిత త‌న వ‌ద్ద అప్పుగా తీసుకున్న డ‌బ్బులు తిరిగి ఇవ్వ‌నందుకు గాను పరంధామ‌రెడ్డి అనే ఫైనాన్షియ‌ర్ కోర్టును ఆశ్ర‌యించారు. కాగా.. 48 గంట‌ల్లోపు రూ.65 ల‌క్ష‌లు సెక్యూరిటీ డిపాజిట్‌గా జీవిత స‌మ‌ర్పించ‌ని ప‌క్షంలో శేఖర్‌ సినిమాకు సంబంధించిన సర్వ హక్కులను ఎటాచ్ చేస్తూ.. ఆ సినిమాను ఎక్కడా ప్రసారం చేయకుండా నిలుపుదల చేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసిన‌ట్లుగా ప‌రంధామ‌రెడ్డి మీడియాకు వెల్ల‌డించారు. దీనిపై రాజ‌శేఖ‌ర్ కానీ, జీవిత కానీ స్పందించలేదు. ఐతే ఈ సినిమా నిర్మాత‌ల్లో ఒక‌రైన బీరం సుధాక‌ర్ రెడ్డి.. పరంధామ‌రెడ్డి ప్ర‌క‌ట‌న‌పై రెస్పాండ‌య్యారు.

శేఖర్ సినిమాకు నిర్మాత జీవిత కాద‌ని, తాను అని, త‌న సినిమాకు ఎవ‌రైనా న‌ష్టం క‌లిగిస్తే ఊరుకునేది లేద‌ని సుధాక‌ర్ రెడ్డి హెచ్చ‌రించారు. హీరోగా న‌టించిన రాజ‌శేఖ‌ర్‌కు, ద‌ర్శ‌కురాలిగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించిన జీవిత‌కు తాను పూర్తిగా పారితోష‌కాలు ఇచ్చేశాన‌ని, ఈ సినిమా వాళ్లిద్ద‌రిదీ అనుకుని ఎవరో కోర్టుకు వెళ్లారని, త‌న‌ సినిమాకు వారు నష్టం కలిగిస్తే.. ఏదైనా జరిగితే.. తాను పరువునష్టందావా కేసు వేస్తాన‌ని.. తాను నష్టపోయిన మొత్తాన్ని వాళ్ల‌ నుంచి రాబడతాన‌ని.. త‌న సినిమాను ఎవ‌రికీ అమ్మ‌కూడ‌ద‌ని ఎలా అంటార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. మ‌రి ఈ వివాదం ఎక్క‌డిదాకా వెళ్తుందో చూడాలి.