పాత రేట్లే పాత రేట్లే – రాజుగారి మాట

తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణ టికెట్ రేట్ల పెంపు చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. బాలేదన్న సినిమాను డిజాస్టర్ కంటే కింది స్థాయికి ఆచార్యను తీసుకెళ్లిన ఘనత దీనికే దక్కుతుంది. బాగుందన్న సర్కారు వారి పాటకు పూర్తి స్థాయి వసూళ్లు రాకుండా అడ్డుపడుతున్న నిందా దీనికే చెందుతుంది. అంతగా జనాన్ని భయపెట్టిన ఈ పెంపు భూతం పట్ల ఇప్పుడు నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు గుర్రుగా ఉన్నారు. ఇదిలాగే కంటిన్యూ అయితే కూర్చున్న కొమ్మను నరుక్కున్నట్టు అవుతుందని అర్థమైపోయింది.

అందుకే ఈ నెల 27న విడుదల కాబోతున్న వెంకటేష్ వరుణ్ తేజ్ ల మల్టీ స్టారర్ ఎఫ్3కి ఎలాంటి పెంచడాలు చేయడం లేదు. ఈ లీక్ ముందే వచ్చింది కానీ ప్రేక్షకుల్లో ఎంతో కొంత అనుమానం లేకపోలేదు. దాన్ని పూర్తిగా క్లియర్ చేస్తూ నిర్మాత దిల్ రాజు ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సినిమాకు పాత రేట్లే ఉంటాయని తేల్చి చెప్పేశారు. నెంబర్ చెప్పలేదు కానీ మొన్నటిదాకా మల్టీ ప్లెక్సులు సింగల్ స్క్రీన్లు అమలుపరిచిన 395 – 210 రూపాయల పద్ధతిలో మాత్రం ఖచ్చితంగా ఉండదు. రీజనబుల్ గానేపెట్టబోతున్నారు .

అసలే ఎఫ్3 ఫ్యామిలీ ఎంటర్ టైనర్. కుటుంబ ప్రేక్షకులు రావాలంటే టికెట్ ధరలు ఎప్పటిలాగే అందుబాటులో ఉండాలి. పైగా బడ్జెట్ కూడా వందల కోట్లేమీ కాలేదు కాబట్టి పాత మోడల్ లో వెళ్లడమే సుఖం. గతంలో ఎఫ్2 తీవ్రమైన పోటీ తట్టుకుని బ్లాక్ బస్టర్ గా నిలిచిందంటే కారణం ఫ్యామిలీస్ కట్టకట్టుకుని థియేటర్లకు రావడమే. అందుకే దిల్ రాజు తీసుకున్న నిర్ణయం మంచి ఫలితాన్నే ఇస్తుంది. ఇదేదో రెండు నెలల క్రితమే చేసి ఉంటే మరికొన్ని సినిమాలకు ప్రయోజనం కలిగేది. ఇప్పుడైనా చేశారు సంతోషం.