సినిమా ఈవెంట్లకు అతిథులుగా వచ్చినపుడు.. ఆ చిత్ర బృందంలోని వారిని పొగడక తప్పదు. అప్పుడు కొన్ని అతిశయోక్తులు జోడించడం మామూలే. ఐతే సీనియర్ హీరో రాజశేఖర్ సినిమా శేఖర్ ప్రి రిలీజ్ ఈవెంట్‌కు వచ్చిన అగ్ర దర్శకుడు సుకుమార్ సైతం రాజశేఖర్ గురించి ఇలాగే మాట్లాడారు కానీ.. ఆయన నిజాయితీగానే ఆ వ్యాఖ్యలు చేసినట్లుగా అనిపించడం విశేషం.
తన స్పీచ్ మొదలుపెడుతూనే తాను సినిమాల్లోకి రావడానికి పరోక్షంగా రాజశేఖరే ఇన్‌స్పిరేషన్ అని సుకుమార్ చెప్పడం చూస్తే.. ఆయన మనస్ఫూర్తిగానే ఈ మాట అన్నారా అన్న సందేహం కలిగింది. ఎందుకంటే చిరంజీవి గురించి మాట్లాడుతున్నపుడు కూడా సుక్కు ఇలాగే అన్నారు. కానీ రాజశేఖర్ గురించి ఇలా చెప్పడం వెనుక కారణమేంటో సుక్కు వివరించాక అందరూ సమాధానపడ్డారు.
స్కూల్ రోజుల్లో కృష్ణ అనే తన ఫ్రెండు హీరోలందరినీ ఇమిటేట్ చేసేవాడని.. అతణ్ని చూస్తే తనకు చాలా అసూయగా ఉండేదని.. తాను కూడా అలా చేయాలని ట్రై చేసి రాజశేఖర్‌ను అనుకరించానని.. అది అందరికీ నచ్చి తనను పొగిడారని.. అలా తన టాలెంట్ ప్రూవ్ చేసుకోవడంతో సినిమాలపై ఆసక్తి కలిగిందని చెబుతూ.. శేఖర్ ఈవెంట్ వేదిక మీద సుక్కు రాజశేఖర్ డైలాగ్, మేనరిజమ్స్‌ను ఇమిటేట్ చేసి చూపించడం విశేషం. ఈ సందర్భంగా అంకుశం, మగాడు లాంటి సినిమాల్లో రాజశేఖర్ ఎంత అద్భుతంగా నటించారో గుర్తు చేసుకున్నారు సుకుమార్.
మామూలుగా సినిమాల ద్వారా బతుకుతూ.. తమ కుటుంబంలోని అమ్మాయిలను సినిమాల్లోకి తేవడానికి మాత్రం అందరూ భయపడుతుంటారని.. కానీ రాజశేఖర్ గారు అలా చేయకుండా తన ఇద్దరు అమ్మాయిలను సినిమాల్లోకి తీసుకురావడం ద్వారా ఈ పరిశ్రమ చాలా పవిత్రమైందని చాటిచెప్పారని.. దీనిపై తనకున్న గౌరవాన్ని చాటుకున్నారని.. అందుకు ఆయనపై తనకు గౌరవభావం కలిగిందని సుకుమార్ పేర్కొన్నారు. జీవిత ఓవైపు దర్శకురాలిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ, ఇంకోవైపు ప్రొడక్షన్ చూసుకుంటూ, మరోవైపు కుటుంబాన్ని కూడా చూసుకుంటున్నారని, అది మామూలు విషయం కాదని.. ఆమె కోసం శేఖర్ సినిమా చాలా బాగా ఆడాలని సుక్కు ఆకాంక్షించారు.