ఓన్లీ మాస్ అంటున్న యంగ్ హీరో

ఒకప్పుడు లవ్ స్టోరీస్ తో లవర్ బాయ్ ఇమేజ్ అందుకున్న హీరో రామ్ ఇప్పుడు రూటు మార్చేశాడు. అవును రామ్ సినిమాల లిస్టు చూస్తే ఈ విషయం అర్థమైపోతుంది. పూరి ఏ క్షణాన రామ్ ని ‘ఇస్మార్ట్ శంకర్’ గా మార్చేసి మాస్ ఆడియన్స్ కి దగ్గర చేశాడో అప్పటి నుండి రామ్ మాస్ కమర్షియల్ సినిమాలే ఒప్పుకుంటున్నాడు.

ఇస్మార్ట్ తర్వాత రామ్ రెడ్ అనే సినిమా చేశాడు. యాక్షన్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిన ఈ సినిమా ఓ మోస్తరు కలెక్షన్స్ రాబట్టింది. ఆ వెంటనే కోలీవుడ్ మాస్ డైరెక్టర్ లింగుస్వామితో ‘ది వారియర్’ సినిమా లాక్ చేసుకొని సెట్స్ పై పెట్టేశాడు. ప్రస్తుతం షూటింగ్ స్టేజిలో ఉన్న ఈ సినిమా టీజర్ చూస్తే రామ్ మాస్ హీరోగా నిలబడటానికి ఎంత కష్టపడుతున్నాడో తెలుస్తుంది. టీజర్ అంతా మాస్ యాక్షన్స్ తో నింపేసి సినిమాలో కంటెంట్ ఎలా ఉండబోతుందో చూపించారు.

ఇక నెక్స్ట్ బోయపాటి శ్రీను తో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు రామ్. బోయపాటితో సినిమా అంటే ఏ రేంజ్ లో యాక్షన్ ఉంటుందో ఊహించుకోవచ్చు. రామ్ కోసం అలాంటి మాస్ కంటెంట్ నే తీసుకొని స్క్రిప్ట్ లాక్ చేసుకున్నాడు బోయపాటి. ఈ సినిమాతో మాస్ హీరోగా రామ్ మరో మెట్టు ఎక్కబోతున్నాడని యూనిట్ అంటోంది. పవర్ పాక్డ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాతో కంప్లీట్ యాక్షన్ హీరోగా మరిపోనున్నాడు రామ్.

ఇకపై రామ్ తో సినిమా చేయాలని ఏ దర్శకుడైనా అనుకుంటే మాస్ కథతోనే అప్రోచ్ అవ్వాల్సి ఉంది. ఇప్పుడప్పుడే లవ్ స్టోరీస్ చేసే ఆలోచనలో లేడు రామ్ పోతినేని. వరుసపెట్టి మాస్ దర్శకులతో యాక్షన్ సినిమాలు ప్లాన్ చేసుకుంటూ టాప్ ప్లేస్ కి వెళ్ళాలని భావిస్తున్నాడు. మరి రామ్ ఎంచుకున్న ఈ రూటు అతన్ని ఏ ప్లేస్ కి తీసుకెళ్తుందో చూడాలి.