సర్కారు వారి పాటకు కేసీఆర్ సర్కారు ‘డబుల్’ ఓకే

సర్కారు వారి పాట సినిమాకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డబుల్ థమాకా ఇచ్చేసింది. కొత్త సినిమాలు.. అగ్ర హీరోల సినిమాలు విడుదలయ్యే వేళలో.. సదరు సినిమా నిర్మాతలకు సానుకూలంగా స్పందిస్తున్న కేసీఆర్ సర్కారు తాజాగా మహేశ్ సినిమాకు అలానే రియాక్టు అయ్యింది. ఈ శుక్రవారం విడుదల కానున్న ‘సర్కారు వారి పాట’ మూవీకి టికెట్ల ధరల్ని పెంచేందుకు వీలుగా అనుమతిని జారీ చేసింది.

తెలంగాణ సర్కారు తాజాగా విడుదల చేసిన జీవో ప్రకారం టికెట్ల ధరల పెంపునకు ఓకే చెప్పింది. మల్టీఫ్లెక్సులు.. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.50.. ఎయిర్ కండిషన్ సాధారణ థియేటర్లలో రూ.30 పెంపునకు వీలుగా అనుమతి ఇచ్చింది. కాకుంటే.. ఇందుకు ఏడు రోజుల సమయం మాత్రమే ఇచ్చింది. అంటే.. మే 12 నుంచి 18 వరకు మాత్రమే పెంచిన ధరలు వర్తిస్తాయి. ఆ తర్వాత పాత ధరలకే టికెట్లను అమ్మాల్సి ఉంటుంది.

అంతేకాదు.. మరో శుభవార్తను కూడా వెల్లడించింది. ఈ సినిమాకు మరో షో అదనంగా వేసుకోవటానికి వీలుగా అనుమతుల్ని జారీ చేసింది. దీంతో.. మే 12 ఉదయం 7 గంటల నుంచి షో వేసుకునేందుకు అనుమతిని ఇచ్చింది.అంటే.. రోజుకు ఐదు ఆటలకు పర్మిషన్ మంజూరైంది. దీంతో.. ఫ్యాన్స్ కోసం అర్థరాత్రి దాటిన తర్వాత వేసే బెనిఫిట్ షోకు అనుమతిని కూడా స్థానిక పోలీసులు ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. ఈ వరుస వార్తలు.. సర్కారు వారి పాట నిర్మాతలకే కాదు.. మహేశ్ అభిమానులకు కూడా సంతోషాన్ని కలిగిస్తాయని చెప్పక తప్పదు. కాకుంటే.. టికెట్ కొనేటప్పుడు పెరిగిన ధరాఘాతం ఒక్కటే ఇబ్బందిగా అనిపిస్తుంది. అయినా.. అభిమాన హీరో మూవీకి రూ.50 అదనంగా పే చేయటం పెద్ద విషయం కాదు కదా?