కెరీర్లో ఒక దశ వరకు చిన్న, మీడియం రేంజ్ హీరోలతోనే సినిమాలు చేస్తూ వచ్చాడు పరశురామ్. ‘గీత గోవిందం’కు ముందు అతను తీసిన సినిమాలో హీరో అల్లు శిరీష్ కావడం గమనార్హం. ఐతే ‘గీత గోవిందం’తో ఒక్కసారిగా అతడి రేంజ్ మారిపోయింది. అనూహ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేసే అవకాశం దక్కించుకున్నాడు.
ఐతే ఇది అనుకోకుండా కుదిరిన ప్రాజెక్ట్. నిజానికి నాగచైతన్యతో అతడి తర్వాతి సినిమా తెరకెక్కాల్సింది. 14 రీల్స్ ప్లస్ బేనర్లో ఈ సినిమా చేయడానికి అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి కూడా. ఐతే వంశీ పైడిపల్లితో అనుకున్న ప్రాజెక్టును మహేష్ క్యాన్సిల్ చేయడం.. అంతకుముందే పరశురామ్ చెప్పిన లైన్ నచ్చి ఫుల్ నరేషన్ కోరడం.. తర్వాత పరశురామ్ సూపర్ స్టార్‌ను మెప్పించి ‘సర్కారు వారి పాట’ సినిమా చేయడం చకచకా జరిగిపోయాయి. మరి ‘సర్కారు వారి పాట’తో పెద్ద లీగ్‌లోకి పరశురామ్ వెళ్లే ఛాన్సులుండటంతో 14 రీల్స్ ప్లస్‌లో చైతూతో సినిమా ఉండదనే అనుకున్నారంతా.
కానీ ఈ రోజు ‘సర్కారు వారి పాట’ ప్రమోషన్లలో భాగంగా మీడియాను కలిసిన పరశురామ్.. ఈ ఊహాగానాలకు తెరదించాడు. తన తర్వాతి చిత్రం చైతూతోనే ఉంటుందని స్పష్టం చేశాడు. ‘సర్కారు వారి పాట’ కచ్చితంగా హిట్టవుతుందని, పరశురామ్ రేంజ్ మారిపోతుందని, ఈ తరహా పెద్ద ఛాన్సుల కోసమే అతను చూస్తాడని అనుకున్నారు కానీ.. ముందు ఇచ్చిన కమిట్మెంట్‌ను గౌరవించి చైతూతో సినిమా చేయడానికి పరశురామ్ సిద్ధపడటం విశేషమే. 14 రీల్స్ ప్లస్ బేనర్లోనే ఈ సినిమా తెరకెక్కనుంది.
ఇక ‘సర్కారు వారి పాట’ విశేషాల గురించి మాట్లాడుతూ.. మమ మహేషా పాట అభిమానులతో పాటు మాస్‌కు జాతరలా ఉంటుందని పరశురామ్ చెప్పాడు. ఈ చిత్రం ఫుల్ లెంగ్త్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ అని అతనన్నాడు. సినిమాలో చర్చనీయాంశంగా మారిన ‘నేను విన్నాను నేను ఉన్నాను’ డైలాగ్ గురించి మాట్లాడుతూ.. స్క్రిప్టు నరేషన్లో ఈ డైలాగ్ చెప్పగానే మహేష్ ఏమీ అభ్యంతరం చెప్పకుండా డైలాగ్‌ను ఓకే చేశాడని.. రాజకీయాలతో కనెక్షన్ గురించి అతను పట్టించుకోలేదని వివరించాడు.