ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ 2లు దేశవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించాక ప్యాన్ ఇండియా పదానికి ప్రాధాన్యం మరింతగా పెరిగిపోయింది. బాహుబలితో ప్రభాస్ రాజమౌళిలు సృష్టించిన మార్కెట్ ని ఇప్పుడు మిగిలినవాళ్లు విస్తృతపరిచే పనిలో ఉన్నారు. అయితే ఈ కాన్సెప్ట్ ముప్పై ఏళ్ళ క్రితమే మన సౌత్ లో వచ్చిందని, అందులో మన టాలీవుడ్ హీరో నాగార్జున కూడా భాగమయ్యారని తెలిస్తే పాత సినిమాల మీద అవగాహన తక్కువగా ఉన్నవాళ్లకు ఖచ్చితంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆ విశేషాలేంటో మీరే చూడండి.
1991లో శాండల్ వుడ్ స్టార్ రవిచంద్రన్ శాంతి క్రాంతి టైటిల్ తో ఒక భారీ సినిమా తీశారు. కన్నడలో తను హీరోగా, తెలుగులో నాగార్జున, తమిళం – హిందీలో రజనీకాంత్ లను కథానాయకులుగా తీసుకుని నాలుగు భాషల్లో వేర్వేరుగా ఏకకాలంలో షూటింగ్ చేశారు. అన్ని లాంగ్వేజెస్ లో జుహీ చావ్లానే హీరోయిన్. ఆయన తండ్రి ప్రముఖ నిర్మాత వీరాస్వామి. అప్పటిదాకా ఆ కుటుంబం సంపాదించినదంతా ఈ సినిమాలోనే పెట్టారు. కోట్ల రూపాయలు మంచి నీళ్లలా ఖర్చయ్యాయి. ఒకదశలో డబ్బు కొరత ఏర్పడింది.
ఈలోగా సర్దుబాటు కోసం చినతంబీ(తెలుగు చంటి)రీమేక్ రామాచారి చేసుకుని సూపర్ హిట్ కొట్టారు. దానికి వచ్చిన సొమ్ములతో శాంతి క్రాంతి పూర్తయ్యింది. కెజిఎఫ్ 1లో మనకు రాఖీభాయ్ కథ చెప్పే అనంత్ నాగ్ ఇందులో మెయిన్ విలన్. హీరో పాత్ర పోలీస్ ఆఫీసర్. సంగీత దర్శకులు హంసలేఖ 10 పాటలు ఇచ్చారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ యాక్షన్ గ్రాండియర్ దారుణంగా డిజాస్టర్ అయ్యింది. ఒకవేళ హిట్ అయ్యుంటే చరిత్ర ఇంకోలా ఉండేది కానీ మొదటి ప్యాన్ ఇండియా మూవీ ఘనత మాత్రం రవిచంద్రన్ దే.