మ‌హేష్‌.. అవి అవాయిడ్ చేసి ఉండాల్సిందే

ప్ర‌స్తుత‌ సామాజిక ప‌రిస్థితుల వ‌ల్ల కావ‌చ్చు.. జ‌నాల ఆలోచ‌న‌ల్లో వ‌చ్చిన మార్పు వ‌ల్ల కావ‌చ్చు..  ఓటీటీల ప్ర‌భావం కావ‌చ్చు.. సినిమాల్లో చూపించే స‌న్నివేశాలు, ప‌లికే సంభాష‌ణ‌ల్లో చాలా మార్పు వ‌చ్చింది. ఇంత‌కుముందు ఆలోచ‌న స్థాయిలోనే బ్రేక్ అయిపోయే కొన్ని స‌న్నివేశాలు, మాట‌ల‌ను ఇప్పుడు సినిమాల్లో చూసేస్తున్నాం. ఐతే బోల్డ్ ముద్ర వేయించుకునే చిన్న‌, మీడియం రేంజ్ సినిమాల్లో విష‌యంలో ప్రేక్ష‌కులు కూడా ముందే ప్రిపేరై ఉంటున్నారు.

అలాంటి సీన్లు, డైలాగుల విష‌యంలో పెద్ద చ‌ర్చేమీ ఉండ‌ట్లేదు. కానీ పెద్ద హీరోలు, ద‌ర్శ‌కులు చేసే.. ప్ర‌ధానంగా ఫ్యామిలీ ఆడియ‌న్స్ చూసే సినిమాల్లో మాత్రం ఇలాంటి సీన్లు, డైలాగులు పెడితే ఇప్ప‌టికీ ఇబ్బందిక‌రంగానే ఉంటుంది. ఈ మ‌ధ్య పుష్ప సినిమాలోని ఒక స‌న్నివేశం విష‌యంలో అభ్యంత‌రాలు వ్య‌క్తం కాగా.. రిలీజ్ త‌ర్వాత రెండు రోజుల‌కు దాన్ని డెలీట్ చేయ‌డం తెలిసిందే.

ఇప్పుడు మ‌హేష్ బాబు సినిమా స‌ర్కారు వారి పాట ట్రైల‌ర్లో వినిపించిన రెండు డైలాగుల విష‌యంలో ఇలాంటి అభ్యంత‌రాలే వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఒక సీన్లో మ‌హేష్ ఎందుకంటే ఆడిది మ‌రి పెద్ద‌.. అంటూ చెయ్యి చూపిస్తూ మ‌హేష్ చెప్పిన డైలాగ్ వ‌ల్గ‌ర్‌గా అనిపిస్తోంది. డైలాగ్ పూర్తి చేయ‌క‌పోయినా.. ఉద్దేశం ఏంట‌న్న‌ది అర్థ‌మైపోతోంది మ‌హేష్ హావ‌భావాల‌తోనే. ఇక ట్రైల‌ర్ చివ‌ర్లో ఓ వంద వ‌యాగ్రాలు వేసి శోభ‌నం కోసం వెయిట్ చేస్తున్న పెళ్లికొడుకు గ‌దికొచ్చిన‌ట్లొచ్చారు అంటూ మ‌హేష్ ప‌లికిన ఇంకో డైలాగ్ కూడా తేడాగానే అనిపించింది. 

మ‌హేష్ సినిమాలంటే ఫ్యామిలీ ఆడియ‌న్స్ పెద్ద ఎత్తున థియేట‌ర్ల‌కు వ‌స్తారు. కుటుంబంతో క‌లిసి సినిమా చూస్తున్న‌పుడు ఇలాంటి డైలాగ్స్ వ‌స్తే క‌చ్చితంగా ఇబ్బంది ఉంటుంది. మ‌హేష్ లాంటి పెద్ద స్టార్ నోటి నుంచి ఇలాంటి డైలాగులు క‌చ్చితంగా విన‌డానికి ఏదోలాగే ఉంటుంది. యూత్‌ను ఆక‌ట్టుకోవ‌డానికి ఇలాంటి డైలాగ్స్ పెడితే.. ఫ్యామిలీస్ సంగతి కూడా దృష్టిలో ఉంచుకోవాలి. మిగ‌తా విష‌యంలో మంచి ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్ లాగా అనిపించిన ఈ సినిమాలో ఇలాంటి డైలాగులను ద‌ర్శ‌కుడు ప‌ర‌శురామ్ అవాయిడ్ చేయాల్సిందేమో. మ‌హేష్ అయినా వీటిని ఎలా ఓకే చేశాడ‌న్న‌దే డౌట్.