సిద్ తప్పేమి లేదంటున్న శ్రీరామ్

సినిమా సంగీతంలో చాలా మార్పులు వచ్చాయి. అలనాటి ఘంటసాలతో మొదలుపెట్టి ఇళయరాజా రెహమాన్ శకం దాకా ఇప్పటి తమన్ ప్రభంజనం వరకు ఎన్నెన్నో పోకడలు. ఇవన్నీ మ్యూజిక్ లవర్స్ ని మెప్పిస్తూ వచ్చాయి. ఒకప్పుడు తెలుగు స్వచ్ఛంగా పాడేవాళ్ళనే ప్లే బ్యాక్ సింగర్స్ గా తీసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడలా కాదు.

బాష ఏదైనా రాష్ట్రమేదైనా గొంతు వైరల్ అయ్యిందనో లేదా త్వరగా కనెక్ట్ అవుతుందనో తెలిస్తే చాలు వెంటనే తెచ్చేసి అచ్చ తెలుగుని ఇంగ్లీష్ లో రాయించి మరీ పాడిస్తున్నారు. ఉదిత్ నారాయణ్ కొన్నేళ్ల పాటు తెలుగులో చక్రం తిప్పడానికి కారణం ఇదే. తప్పులు ఎన్ని పాడినా పాస్ అయిపోయారు. గత కొంత కాలంగా సిద్ శ్రీరామ్ మీద కూడా ఇలాంటి కామెంట్స్ వస్తున్నాయి.

సర్కారు వారి పాట ప్రమోషన్ లో భాగంగా గీత రచయిత అనంత శ్రీరామ్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ ప్రస్తావన వచ్చినప్పుడు ఆయన సిద్ నే పూర్తిగా వెనకేసుకొచ్చి వింటున్న వాళ్లే పొరపాటు పడుతున్నారని చెప్పడం ఆశ్చర్యం కలిగించింది. సిద్ ఉచ్చారణలో అసలే దోషం లేదని సర్టిఫికెట్ ఇచ్చేశారు

టెక్నాలజీలో చాలా మార్పులు రావడం వల్ల ఫైనల్ సౌండ్ అవుట్ ఫుట్ లో కొంత తేడా అనిపించొచ్చని అంతే తప్ప అక్కడ సిద్ ఎలాంటి పొరపాటు చేయలేదని తేల్చి చెప్పేశారు. అయినా సాంకేతిక అభివృద్ధి చెందితే స్పష్టత పెరగాలి కానీ ఇలా ఆడియన్స్ ని సింగర్ కు తగ్గట్టు ప్రిపేర్ అవ్వమని చెప్పడం మాత్రం వింతే. దీని సంగతి ఎలా ఉన్నా సర్కారు వారి పాట నుంచి చార్ట్ బస్టర్ అయిన పాట ఈ కళావతే. ఇప్పటికే 155 మిలియన్లకు పైగా వ్యూస్ తో ఆల్బమ్ లోనే బెస్ట్ సాంగ్ అనిపించుకుంది.