మెగాస్టార్ చిరంజీవి కరోనా సమయంలో సినీ కార్మికుల కోసం ఎంత చేశాడో అందరికీ తెలుసు. సీసీసీ పేరుతో ఫౌండేషన్ పెట్టి ముందుగా తాను భారీ ఎత్తున విరాళం అందించి, మిగతా ఇండస్ట్రీ ప్రముఖులతోనూ విరాళాలు సేకరించి ఆ నిధితో కొన్ని నెలల పాటు కార్మికులకు నిత్యావసరాలు అందజేయడంలో చిరుది కీలక పాత్ర. అలాగే సామాన్య జనాల కోసం ఆక్సిజన్ బ్యాంకులు ఏర్పాటు చేయించి ఆ రకంగానూ ఎంతో సేవ చేశారు చిరు. దీనికి తోడు ఏపీలో టికెట్ల ధరల సమస్యను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషించి ఇండస్ట్రీకి మేలు చేశాడు చిరు.
ఇప్పుడు ఆయన మరో బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టే సంకేతాలు కనిపిస్తున్నాయి. తెలుగు సినీ కార్మికుల కోసం హైదరాబాద్‌లోని చిత్రపురి కాలనీలో ఆసుపత్రి నిర్మించే యోచనలో చిరు ఉన్నట్లుగా తెలుస్తోంది.
ఆదివారం మేడే ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఈ దిశగా సంకేతాలు ఇచ్చారు.
చిరంజీవి ఇండస్ట్రీ కోసం, సినీ కార్మికుల కోసం ఎంతో చేశారని.. కరోనా టైంలో ఎంతో సాయపడ్డారని.. ఇప్పుడు ఆయన సినీ కార్మికుల కోసం ఆసుపత్రి నిర్మించాలనే ఆలోచనలో ఉన్నారని తలసాని వ్యాఖ్యానించారు. ఇది జరిగితే వేలమంది కార్మికులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని.. చిరు ఆ పని తప్పకుండా చేయాలని తలసాని అన్నారు.
చిత్రపురి కాలనీలో సినీ కార్మికుల కోసం ఆసుపత్రి, పాఠశాల నిర్మించడానికి స్థలం అందుబాటులో ఉందని, వాటి కోసం ఆ స్థలాల్ని కేటాయించడానికి ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉందని తలసాని అన్నారు. మరి తలసాని మాట వరసకు అన్నారా.. నిజంగానే ప్రభుత్వం స్థలం ఇవ్వడం, చిరు నేతృత్వంలో ఆసుపత్రి నిర్మాణం చేపట్టడం జరుగుతాయా అన్నది చూడాలి. ఇది నిజంగా జరిగితే మాత్రం ఇండస్ట్రీలో చిరు పేరు ఎప్పటికీ నిలిచిపోతుందనడంలో సందేహం లేదు.