చిత‌గ్గొట్టేసిన కంగ‌నా ర‌నౌత్

బాలీవుడ్లో ఇప్పుడు నంబ‌ర్ వ‌న్ హీరోయిన్ అంటే కంగ‌నా ర‌నౌతే. కేవ‌లం ఆమె పేరు మీదే సినిమాలు ఆడుతున్నాయి కొన్నేళ్లుగా. లేడీ ఓరియెంటెడ్ సినిమాతో వంద కోట్ల వ‌సూళ్లు రాబ‌ట్ట‌గ‌ల స‌త్తా ఆమె సొంతం. మ‌ణిక‌ర్ణిక తర్వాత ఆమె న‌టించిన జ‌డ్జిమెంట‌ల్ హై క్యా, పంగా, త‌లైవి సినిమాలు క‌మ‌ర్షియ‌ల్‌గా ఆశించిన ఫ‌లితాన్నివ్వ‌కున్నా కంగ‌నా ఇమేజ్ అయితే దెబ్బ తిన‌లేదు. ఇప్ప‌టికీ ఆమె సినిమా వ‌స్తుంటే పెద్ద సంఖ్య‌లోనే ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు వెళ్తారు.

కెరీర్లో అనేక భిన్న‌మైన పాత్ర‌లు చేసిన కంగ‌నా.. ఇప్పుడు మ‌రో వైవిధ్య‌మైన సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఆ చిత్ర‌మే.. దాక‌డ్. మామూలుగా హీరోలే చేసే స్పెష‌ల్ ఏజెంట్ పాత్ర‌లో కంగ‌నా క‌నిపించ‌నుందీ చిత్రంలో. తాజాగా ఈ సినిమా ట్రైల‌ర్ లాంచ్ చేశారు. స్టార్ హీరోల‌కు దీటుగా యాక్ష‌న్ విన్యాసాల‌తో అద‌ర‌గొట్టేసింది కంగ‌నా. ఇటు గ్లామ‌ర్‌తో, అటు యాక్ష‌న్‌తో కంగనా అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది.

హ్యూమ‌న్ ట్రాఫికింగ్ మాఫియాకు వ్య‌తిరేకంగా ప‌ని చేసే ఏజెంట్ పాత్ర‌లో కంగనా న‌టించిందీ చిత్రంలో. హీరోయిన్లు ఏజెంట్ పాత్ర‌ల్లో క‌నిపించ‌డం, యాక్ష‌న్ విన్యాసాలు చేయ‌డం హాలీవుడ్ సినిమాల్లో మాత్ర‌మే చూస్తుంటాం. ఐతే తాను దేనికీ త‌క్కువ కాద‌ని రుజువు చేయాల‌ని త‌పించే కంగ‌నా.. చాలా క‌ష్ట‌మైన విన్యాసాల‌తో వావ్ అనిపించింది.

హాలీవుడ్ స్థాయికి ఏమాత్రం త‌గ్గ‌ని విధంగా క‌నిపించాయి ఇందులో యాక్ష‌న్ స‌న్నివేశాలు. తాను పూర్తి చేయాల్సిన ఆప‌రేష‌న్లో భాగంగా వేశ్య అవ‌తారంలోకి కూడా మార‌డం ఇందులో హైలైట్. ట్రైల‌ర్ అంతా కూడా వ‌న్ ఉమ‌న్ షో అన్న‌ట్లే కంగనానే క‌నిపించింది అంత‌టా. విల‌న్ పాత్ర‌లో అర్జున్ రాంపాల్ న‌టించాడు. ర‌జ‌నీష్ ఘాయ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని దీప‌క్, ముకుల్ నిర్మించారు. ఈ నెల 20న దాక‌డ్ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.