సోషల్ మీడియా ప్రభావం అంతుందా

ఆచార్య ఫలితం దాదాపుగా తేలిపోయింది. అద్భుతాలు చేసే అవకాశం లేనట్టే. కాకపోతే ఫ్లాప్ గా మిగులుతుందా లేక వేసవి సెలవుల అడ్వాంటేజ్ ని వాడుకుని యావరేజ్ గా మారుతుందానేది ఇంకో వారం ఆగితే డిసైడ్ అవుతుంది. సరే సినిమా చూశాక కలిగిన అభిప్రాయాలు కాసేపు పక్కనపెడితే ఆచార్యకు నెగటివ్ ప్రీ పబ్లిసిటీ రావడంలో సోషల్ మీడియా పాత్ర ఉందని అభిమానులు ఆరోపిస్తున్నారు.

ఒక వర్గం అదే పనిగా సినిమా బాగారాలేదని ముందు నుంచి ప్రచారం చేస్తూ వచ్చారని అంటున్నారు. ఇందులో నిజమెంతుందనేది పక్కనపెడితే ఆచార్య ట్రైలర్ కట్ చేసిన విధానం, చివరి పది రోజులు మినహాయించి ముందు నుంచి ఒక బజ్ ని తీసుకురావడంలో ఎదురుకున్న వైఫల్యం పైన చెప్పిన ప్రచారానికి ప్రధాన కారణమని చెప్పొచ్చు.

చిరంజీవి చరణ్ కాంబినేషన్ అంటే ఆర్ఆర్ఆర్ తర్వాత ఆ స్థాయిలో ప్రమోట్ కావాల్సిన మల్టీ స్టారర్. కానీ అలాంటిదేమి జరగలేదు. ఏదో రెగ్యులర్ మెగాస్టార్ మూవీ వస్తోందన్నట్టుగానే పబ్లిసిటీ చేశారు. దానికి తగ్గట్టే ఇప్పుడీ వీక్ కంటెంట్ మరింత దెబ్బ కొట్టింది. సినిమా బాగున్నా బాగాలేకపోయినా దాన్ని ఫైనల్ గా నిర్ణయించేది ప్రేక్షకులు. కానీ తొలి వారం పది రోజులు వీలైనంత ఎక్కువ పబ్లిక్ థియేటర్లకు వచ్చేలా చేయాలంటే మాత్రం ప్రమోషన్ హడావిడి చాలా అవసరం.

ఆ మాటకొస్తే ఆర్ఆర్ఆర్ కు ఎలాంటి హంగామా అక్కర్లేదు. కానీ రాజమౌళి కాళ్లకు చక్రాలు కట్టుకుని మరీ ఇద్దరు హీరోలతో దేశమంతా చుట్టొచ్చారు. ఆచార్యకు కనీసం తెలుగు రాష్ట్రాలు కూడా రౌండ్ వేయలేదు. సో సోషల్ మీడియా కన్నా ఎక్కువ డ్యామేజ్ దేనివల్ల జరిగిందో అర్థమవుతోందిగా!