తెలుగులో హీరోలతో సమానంగా స్టార్ ఇమేజ్ సంపాదించిన కథానాయికల్లో సమంత ఒకరు. యు టర్న్, ఓ బేబీ లాంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో ఆమె మంచి ఫలితాలందుకుంది. అఆ, మజిలీ లాంటి సినిమాల విజయంలో ఆమె పాత్ర ఎంత కీలకమో తెలిసిందే. హీరోలను మించి ఆమెకు పేరొచ్చింది. హీరోయిన్లకు ఇలాంటి ఇమేజ్ అరుదుగా వస్తుంది. గతంతో పోలిస్తే ఆమె కెరీర్ ఊపు కొంచెం తగ్గినా సరే.. ఇంకా తన ఫాలోయింగ్ అయితే పడిపోలేదు.
విడాకుల తర్వాత కెరీర్‌ను పొడిగించుకోవాలని చూస్తున్న సామ్.. జాగ్రత్తగా అడుగులు వేయాల్సిన తరుణమిది. ఇలాంటి టైంలో తమిళంలో ఆమె ముఖ్య పాత్ర పోషించిన ‘కాదువాకుల రెండు కాదల్’ సినిమా తెలుగులోకి ‘కణ్మణి రాంబో ఖటీజా’ పేరుతో అనువాదం అయింది. నయనతార, విజయ్ సేతుపతిలకు కూడా తెలుగులో మంచి గుర్తింపు ఉన్నప్పటికీ.. సినిమాకు ఇక్కడ ప్రధాన ఆకర్షణ మాత్రం సమంతనే.
ఈ సినిమా టీజర్, ట్రైలర్ ఆకర్షణీయంగా అనిపించాయి. పాటలు కూడా ఆకట్టుకున్నాయి. ప్రేక్షకుల్లో ఈ సినిమా పట్ల కొంత ఆసక్తి ఏర్పడింది. ఐతే ఈ ఆసక్తిని ఇంకా పెంచి సినిమాకు బజ్ తీసుకురావడానికి ఛాన్స్ ఉన్నప్పటికీ ఆ దిశగా ప్రయత్నాలు జరగలేదు. ముఖ్యంగా తన సినిమాను సమంత తెలుగులో ప్రమోట్ చేసుకోలేదు. ఈ సినిమా బాగా ఆడితే అది సమంతకే ఎక్కువ లాభం చేకూరుస్తుంది. శాకుంతలం, యశోద లాంటి లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు ముందు ఈ చిత్రం వల్ల కొన్నాళ్లు సమంత వార్తల్లో ఉంటుంది.
రాబోయే చిత్రాలకు దీని సక్సెస్ ఉపయోగపడుతుంది. ‘కేఆర్కేలో’ సమంత టిపికల్ క్యారెక్టర్ చేసినట్లుంది. ఆ పాత్రకు తగ్గట్లు గ్లామర్ విందు చేసినట్లు కూడా కనిపిస్తోంది. అలాంటపుడు సినిమాను బాగా ప్రమోట్ చేసి ఉంటే.. రీచ్ ఎక్కువుండేది. కానీ ఎందుకు సమంత ఆ ప్రయత్నం చేయలేదో తెలియదు మరి. తెలుగులో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్న వాళ్లు పట్టించుకోకుండా సమంత అయినా తన కెరీర్ దృష్ట్యా చొరవ తీసుకోవాల్సింది.