కన్నడ జనాలు దివంగత నటుడు రాజ్ కుమార్‌ను ఒక దేవుడిలాగా చూస్తారు. కన్నడ సినీ చరిత్రలో ఆయన్ని మించిన స్టార్ లేరు. తన సినిమాలతో అమితంగా అలరించడంతో పాటు తన వ్యక్తిత్వంతోనూ కన్నడిగుల మనసులను దోచారాయన. ఆయన వారసత్వాన్నందుకుని సినీ రంగంలోకి అడుగు పెట్టిన శివరాజ్ కుమార్, పునీత్ రాజ్‌కుమార్ సైతం చాలా పెద్ద స్టార్లయ్యారు.
ఐతే కొన్ని నెలల కిందట పునీత్ హఠాత్తుగా గుండెపోటుతో మరణించడం కన్నడిగులను తీవ్ర మనోవేదనకు గురి చేసింది. ఇటీవల పునీత్ చివరి సినిమా జేమ్స్ రిలీజ్ కాగా.. దానికి జనాలు బ్రహ్మరథం పట్టారు. ఆ సందర్భంగా పునీత్ పట్ల, రాజ్ కుమార్ పట్ల కన్నడిగుల ప్రేమ ఎలాంటిదో మరోసారి అందరికీ తెలిసిందే. ఇప్పుడు వారి ప్రేమను అందుకోవడానికి రాజ్ కుమార్ కుటుంబం నుంచి మరో నట వారసుడు వస్తున్నాడు.
అతడి పేరు.. యువరాజ్‌కుమార్.
శివరాజ్, పునీత్‌ల సోదరి కొడుకే ఈ యువరాజ్ కుమార్. రాజ్ కుమార్ కుటుంబం నుంచి వస్తున్న మూడో తరం కథానాయకుడు. యువరాజ్ తెరంగేట్రం కోసం శివ, పునీత్ కొన్నేళ్ల ముందు నుంచే ప్రణాళికలు రచించారు. ఐతే యువరాజ్ అందుకోసం ప్రిపేరవుతున్న తరుణంలోనే పునీత్ హఠాత్తుగా కన్నుమూశాడు. జేమ్స్ కంటే ముందు పునీత్ నటించిన యువరత్న చిత్రాన్ని రూపొందించిన సంతోష్ ఆనండ్రం ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నాడు.
కేజీఎఫ్, కేజీఎఫ్-2, సలార్ చిత్రాలతో ఇప్పుడు ఇండియాలోనే బిగ్గెస్ట్ బేనర్లలో ఒకటిగా ఎదిగిన హోంబలె ఫిలిమ్స్.. యువరాజ్‌కుమార్‌ను హీరోగా పరిచయం చేయబోతోంది. ఈ సంస్థ పునీత్‌తో ఒక భారీ పాన్ ఇండియా సినిమాను ప్లాన్ చేసింది గత ఏడాది. అనౌన్స్‌మెంట్ కూడా ఇచ్చారు. కానీ ఇంతలో పునీత్ కన్నుమూశాడు. ఇప్పుడు యువరాజ్ బాధ్యతను ఆ సంస్థ తీసుకుంది.