స్టార్ హీరో డేరింగ్ కామెంట్

ఉత్త‌రాది రాజ‌కీయ నేత‌ల హిందీ ప్రేమ‌ను ద‌క్షిణాది వారిపై రుద్ద‌డానికి ప్ర‌య‌త్నించ‌డంపై ద‌శాబ్దాల నుంచి వివాదం ఉంది. త‌మిళ‌నాడు లాంటి రాష్ట్రాలు హిందీ ఇంపోజిష‌న్‌ను తీవ్రంగా వ్య‌తిరేకిస్తుంటాయి. అయినా కేంద్రంలో అధికారంలో ఉండేది ఎక్కువ‌గా ఉత్త‌రాది నేత‌లే కావ‌డంతో హిందీని సౌత్ మీద రుద్దే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతుంటాయి.

తాజాగా హోం మంత్రి అమిత్ షా.. భిన్న రాష్ట్రాల ప్ర‌జ‌లు హిందీలో మాట్లాడాల‌ని, ఇంగ్లిష్‌ను ప‌క్క‌న పెట్టాల‌ని వ్యాఖ్యానించ‌డం ఎంత పెద్ద దుమారం రేపిందో తెలిసిందే. దీనిపై సౌత్ పొలిటీషియ‌న్సే కాక సామాన్యులు కూడా తీవ్రంగా స్పందించారు. ఇప్పుడు క‌న్న‌డ టాప్ స్టార్ల‌లో ఒక‌డైన కిచ్చా సుదీప్‌.. హిందీ మీద డేరింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు.

అత‌ను క‌న్న‌డ సినిమా కేజీఎఫ్‌-2 పాన్ ఇండియా స్థాయిలో భారీ విజ‌యం అందుకున్న నేప‌థ్యంలో మాట్లాడుతూ.. హిందీ ఇంకెంత‌మాత్రం జాతీయ భాష కాదు అని వ్యాఖ్యానించ‌డం విశేషం. కేజీఎఫ్ గురించి ఆంద‌రూ మాట్లాడుతూ ఓ క‌న్న‌డ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో రూపొందించార‌ని అంటున్నార‌ని, అది క‌రెక్ట్ కాద‌ని.. ద‌క్షిణాది ద‌ర్శ‌కులు తీస్తున్నవి ఇండియ‌న్ సినిమాల‌ని.. వాటిని భాషా భేదం లేకుండా ప్ర‌పంచ‌వ్యాప్తంగా చూస్తున్నార‌ని సుదీప్ వ్యాఖ్యానించాడు.

బాలీవుడ్ పాన్ ఇండియా పేరుతో సినిమాలు తీసి తెలుగు, త‌మిళఃలో అనువాదం చేస్తే అవి ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌లేక‌పోతున్నాయ‌ని.. కానీ ఇక్క‌డి సినిమాలు దేశ‌వ్యాప్తంగా ఆడుతున్నాయ‌ని.. అందుకే హిందీ ఇంకెంత‌మాత్రం జాతీయ భాష కాద‌న్న‌ది త‌న అభిప్రాయ‌మ‌ని సుదీప్ అన్నాడు. బాలీవుడ్ వాళ్ల‌కు మంట పుట్టించేలా ఉన్న ఈ వ్యాఖ్య‌ల‌పై అక్క‌డి వాళ్లు ఎలా స్పందిస్తారో చూడాలి.