మెగాస్టార్ చిరంజీవి బయట ఎవరి గురించైనా ఎంత మర్యాదగా మాట్లాడతారో తెలిసిందే. కోపం తెచ్చుకోవాల్సిన సందర్భాల్లో కూడా ఆయన సంయమనం పాటిస్తుంటారు. ఎవరి గురించీ ఒక మాట తూలరు. ఒక మాట పడటానికి కూడా సిద్ధమే కానీ.. తాను ఒక మాట అనాలంటే పరిపరి విధాల ఆలోచిస్తారు. కొందరు అదే పనిగా గొడవకు లాగినా కూడా చిరు.. సైలెంటుగా ఉంటారే తప్ప వివాదానికి అవకాశం ఇవ్వరు.
ఐతే అలాంటి వ్యక్తి చేసిన మంచి పనులను కూడా తగ్గించి చూపడానికి కొందరు ప్రయత్నించడం గత కొన్ని నెలల్లో చూశారు అందరూ. కరోనా టైంలో ముందు పడి కార్మికులను తన శక్తి మేర ఆదుకున్నారు చిరు. సామాన్య ప్రజలకు సైతం ఆక్సిజన్ ప్లాంటులతో సాయపడ్డారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ల సమస్యను అక్కడి ప్రభుత్వ పెద్దల వెంట పడి.. పలు సందర్భాల్లో తనను తాను తగ్గించుకుని ఎంతో కష్టపడి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేశారు.
ఐతే ఇంత చేసినా చిరు కొందరి నుంచి మాటలు ఎదుర్కొన్నారు. చిరు అంతకష్టపడి సమస్యను పరిష్కరిస్తే మనస్ఫూర్తిగా ఆయన్ని అభినందించిన వారు తక్కువ. ఎక్కడ ఆయనకు క్రెడిట్ వెళ్లిపోతుందేమో అని చాలామంది మౌనం వహించారు. ఈ నేపథ్యంలో చిరు ఇటీవల ఆచార్య ఇంటర్వ్యూల కోసమని తనను కలిసి మీడియా ప్రతినిధుల వద్ద తన ఆవేదనను, ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం.
ఆఫ్ ది రికార్డ్ అంటూ ఆయన తన అసంతృప్తినంతా వెళ్లగక్కారట. ఈ క్రమంలో ఆయన తనను తాను నియంత్రించుకోలేకపోయారట. తన స్థాయిని ఎంతో తగ్గించుకుని.. ఏపీ సీఎం ముందు చేతులు జోడించి మాట్లాడింది ఇండస్ట్రీ సమస్య పరిష్కారం కోసమని, తన వ్యక్తిగత లాభం కోసం కాదని.. ఇలా ముందుకొచ్చి ఎంతమంది ఇండస్ట్రీ కోసం కష్టపడ్డారని చిరు ప్రశ్నించారట.
ఎవరూ చేయకపోగా.. కష్టపడ్డ తనను అభినందించడానికి మనసు రాలేదని.. పైగా తన మీద పరోక్షంగా కౌంటర్లు కూడా వేశారని చిరు ఆవేదన వ్యక్తం చేశారట. అయినా ఇవేమీ పట్టించుకోకుండా ఉండిపోయానని చిరు అన్నట్లు తెలిసింది. చిరు లోలోన ఉన్న ఈ ఆగ్రహం గుర్తించే సీనియర్ నిర్మాత, చిరు సన్నిహితుడు ఎన్వీ ప్రసాద్ ‘ఆచార్య’ ఈవెంట్లో.. చిరును విమర్శించే వాళ్లందరికీ చురకలంటించినట్లు తెలుస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates