విశ్వ‌క్సేన్.. ఈసారైనా నమ్మొచ్చా?

తాము చేసిన సినిమా మీద దాని టీంలో అపార‌మైన న‌మ్మ‌కం ఉండొచ్చు. ఆ న‌మ్మ‌కంతోనే సినిమా మొద‌లుపెడ‌తారు. పూర్తి చేస్తారు. ఐతే త‌మ సినిమా విజ‌యం మీద ధీమా వ్య‌క్తం చేయ‌డం వ‌ర‌కు ఓకే కానీ.. మ‌రీ అతి చేసి చెప్ప‌కూడ‌దు. హైప్ కోస‌మ‌ని మాట‌లు కోట‌లు దాటిపోతే.. త‌ర్వాత సినిమా చూశాక అంత లేక‌పోతే అస‌లుకే మోసం వ‌స్తుంది. యువ క‌థానాయ‌కుడు విశ్వ‌క్సేన్ త‌న సినిమాల గురించి ప్ర‌తిసారీ కొంచెం ఎక్కువ చేసే చెబుతుంటాడు.

ఫ‌ల‌క్ నుమా దాస్ నుంచి ఇదే వ‌ర‌స‌. ఇక చివ‌ర‌గా అత‌డి నుంచి వ‌చ్చిన పాగ‌ల్ మూవీ విష‌యంలో అయితే అత‌ను అలాంటిలాంటి స్టేట్మెంట్ ఇవ్వ‌లేదు. క‌రోనా సెకండ్ వేవ్ త‌ర్వాత ఈ సినిమా రిలీజ్ కాగా.. ఈ చిత్రం మామూలుగా ఉండ‌ద‌ని, మూత ప‌డ్డ థియేట‌ర్ల‌ను కూడా ఈ తెర‌పించేస్తుంద‌ని ప్రి రిలీజ్ ఈవెంట్లో పెద్ద స్టేట్మెంటే ఇచ్చాడు విశ్వ‌క్. క‌ట్ చేస్తే పాగ‌ల్ సినిమా తుస్సుమ‌నిపించింది. జ‌నాలు తిర‌స్క‌రించారు.

విశ్వ‌క్ ఇచ్చిన స్టేట్మెంట్ వ‌ల్లో, మామూలుగా ఉన్న క్రేజ్ వ‌ల్లో తొలి రోజు వ‌ర‌కు దీనికి ఓపెనింగ్స్ వ‌చ్చాయి. త‌ర్వాత సినిమా చ‌ల్ల‌బ‌డిపోయింది. అప్పుడు విశ్వ‌క్ స్టేట్మెంట్ గుర్తుకొచ్చి జ‌నాలు న‌వ్వుకున్నారు. క‌ట్  చేస్తే ఇప్పుడు విశ్వ‌క్ కొత్త సినిమా అశోక‌వ‌నంలో అర్జున క‌ళ్యాణం విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. దీని ట్రైల‌ర్ లాంచ్ కార్య‌క్ర‌మంలో విశ్వ‌క్ సినిమా గురించి ఒక రేంజిలో ఎలివేష‌న్లు ఇచ్చాడు విశ్వ‌క్.

క‌రోనా టైంలో ఈ చిత్ర ద‌ర్శ‌కుడు, ర‌చ‌యిత క‌థ చెప్ప‌డానికి వెంట ప‌డుతుంటే.. అస‌లీ సినిమా చేయొద్ద‌నే ఫీలింగ్‌తోనే క‌థ విన‌డం మొద‌లుపెట్టాన‌ని, కానీ ప‌ది నిమిషాల్లోనే సినిమా చేయాల‌ని డిసైడైపోయాన‌ని.. ఇప్పుడు ఫ‌స్ట్ కాపీ చూశాక చెబుతున్నాన‌ని, ఇప్ప‌టిదాకా త‌న కెరీర్లో ఇది బెస్ట్ ఫిలిం అని అన్నాడు. మ‌రి హైప్ కోస‌మే అన్నాడా.. నిజంగా విశ్వ‌క్ కెరీర్లో బెస్ట్ ఫిలిం అయ్యేంత విష‌యం సినిమాలో ఉందా అన్న‌ది చూడాలి. టీజ‌ర్, ట్రైల‌ర్ వ‌ర‌కైతే ఈ చిత్రం ప్రామిసింగ్‌గా అనిపిస్తోంది. మ‌రి సినిమా ఎలా ఉంటుదో తెలియాలంటే మే 6 వ‌ర‌కు ఆగాలి.