కంగారెత్తిస్తున్న కేజీఎఫ్‌-2.. అయినా దిగాల్సిందే

కేజీఎఫ్‌-2 సినిమా ప్ర‌పంచ‌వ్యాప్తంగా మిగ‌తా అన్ని చోట్లా సాధిస్తున్న వ‌సూళ్లు ఒక ఎత్త‌యితే.. ఉత్త‌రాదిన రాబ‌డుతున్న క‌లెక్ష‌న్లు మ‌రో ఎత్తు. అక్క‌డ ఈ సినిమా ప్ర‌భంజ‌నం గురించి ఎంత చెప్పినా త‌క్కువే. కేజీఎఫ్‌-2 హిందీ వెర్ష‌న్ ఇండియాలో తొలి నాలుగు రోజుల్లోనే రూ.190 కోట్ల‌కు పైగా వ‌సూళ్లు రాబ‌ట్టడం మామూలు విష‌యం కాదు. ఏ డైరెక్ట్ హిందీ సినిమా కూడా ఈ స్థాయిలో వ‌సూళ్ల మోత మోగించ‌లేదు ఇప్ప‌టిదాకా. ఒక్క బాహుబ‌లి-2కు మాత్ర‌మే ఇలాంటి వ‌సూళ్లు సాధ్య‌మ‌య్యాయి. వీకెండ్ త‌ర్వాత కూడా ఆ సినిమా ఊపు త‌గ్గ‌లేదు.

సోమ‌వారం కూడా హిందీలో ఈ చిత్రం రూ.25 కోట్ల నెట్ క‌లెక్ష‌న్లు రాబ‌ట్టిందంటే దాని జోరు ఎలా సాగుతోందో అర్థం చేసుకోవ‌చ్చు. వీక్ డేస్‌లోనూ ఇలాంటి వ‌సూళ్లు సాధిస్తున్న సినిమాకు పోటీగా ఇంకో మూడు రోజుల్లో మరో కొత్త చిత్రాన్ని దించాలంటే కంగారుగానే ఉంటుంది. అయినా స‌రే.. జెర్సీ టీం ధైర్యం చేస్తోంది.
ఇప్ప‌టికే ప‌లుమార్లు వాయిదా ప‌డ్డ జెర్సీ హిందీ వెర్ష‌న్.. ఏప్రిల్ 14కు రిలీజ్ ఖ‌రారు చేసుకుని కూడా కేజీఎఫ్‌-2కు జ‌రిగిన అడ్వాన్స్ బుకింగ్స్ చూసి భ‌య‌ప‌డి వారం వాయిదా ప‌డింది.

22కు కొత్త డేట్ ఫిక్స్ చేశారు. వీకెండ్ త‌ర్వాత ఈ సినిమా జోరు త‌గ్గి ఉంటే.. జెర్సీ టీంలో టెన్ష‌న్ త‌గ్గేది. కానీ ఆ సినిమా ఊపు తగ్గ‌ట్లేదు. వీకెండ్లో ఆ సినిమా మ‌రింత దూకుడు ప్ర‌ద‌ర్శిస్తుంద‌నే అనుకుంటున్నారు. కానీ జెర్సీని ఈ వార‌మే రిలీజ్ చేయ‌డం త‌ప్ప వేరే ఛాయిస్ లేదు. ఆ త‌ర్వాతి వారం నుంచి ప్ర‌తి వీకెండ్‌కూ ఒక పెద్ద సినిమా షెడ్యూల్ అయి ఉంది. స్లాట్స్ ఖాళీ లేవు. పైగా ఇప్ప‌టికే ఒక‌సారి కేజీఎఫ్‌-2కు భ‌య‌ప‌డి ఒక వారం వాయిదా వేశాక‌, ఇంకోసారి అదే కార‌ణంతో పోస్ట్ పోన్ చేస్తే అది అవ‌మాన‌క‌రంగా ఉంటుంది.

రెండో వారంలో న‌డుస్తున్న క‌న్న‌డ అనువాద చిత్రానికి భ‌య‌ప‌డి రెండుసార్లు వాయిదా వేయ‌డం బాగుండ‌దు. అందుకే ఏదైతే అయ్యింద‌ని రిలీజ్‌కు రెడీ అయిపోయారు. తెలుగు జెర్సీ ద‌ర్శ‌కుడు గౌత‌మ్ తిన్న‌నూరినే షాహిద్ క‌పూర్-మృణాల్ క‌పూర్ జంట‌గా ఈ సినిమాను రూపొందించాడు. దిల్ రాజు, నాగ వంశీ.. బాలీవుడ్ నిర్మాత అమ‌న్ గిల్‌తో క‌లిసి ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశారు.