ఆచార్య రన్ టైమ్ ఫిక్స్

సినిమాల రన్ టైం విషయంలో ఒక్కో టైంలో ఒక్కో ట్రెండ్ నడుస్తుంటుంది. 2000కు ముందు వరకు సినిమాల నిడివి బాగా ఎక్కువ ఉండేది. మినిమం రెండున్నర గంటలతో ఉండేవి సినిమాలు. 2.45, 3 గంటల నిడివితో సినిమాలు అప్పుడు తరచుగా సినిమాలు వచ్చేవి. కానీ తర్వాతి కాలంలో నిడివి తగ్గుతూ వచ్చింది. రెండు-రెండున్నర గంటల మధ్య నిడివికి పరిమితం అవుతున్నారు. ఈ తరం ప్రేక్షకులకు రన్ టైం ఎక్కువ ఉంటే జనాలకు బోర్ కొట్టేస్తోందన్న ఉద్దేశంతో నిడివి తక్కువ ఉండేలా చూసుకుంటూ వచ్చారు.

కానీ ఈ మధ్య మళ్లీ ట్రెండ్ మారుతోంది. అర్జున్ రెడ్డి, రంగస్థలం లాంటి చిత్రాలు దాదాపు 3 గంటల నిడివితోనూ చాలా బాగా ఆడాయి. తాజాగా ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్-2 చిత్రాలు కూడా ఎక్కువ నిడివితోనే ప్రేక్షకులను మెప్పించాయి. సినిమాలో విషయం బలంగా ఉంటే నిడివి అసలు సమస్యే కాదని ఈ చిత్రాలు రుజువు చేశాయి. ఈ నేపథ్యంలోనే తర్వాతి పెద్ద సినిమా ‘ఆచార్య’ను కూడా ఎక్కువ రన్ టైంతోనే రిలీజ్ చేయబోతున్నట్లు తెలిసింది. యుఎస్‌లో రిలీజ్ కోసం కేడీఎంలను కాస్త ముందుగానే పంపించారు.

డిస్ట్రిబ్యూటర్లకు రన్ టైం తెలిసిపోయింది. అక్కడి వారి సమాచారం ప్రకారం ‘ఆచార్య’ రన్ టైం 2 గంటల 46 నిమిషాలు. తెలుగు రాష్ట్రాల్లో కూడా అదే నిడివితో సినిమా రిలీజ్ కావచ్చు. కొరటాల తన కెరీర్లోనే చాలా ఎక్కువ టైం తీసుకుని చేసిన సినిమా ఇది. పోస్ట్ ప్రొడక్షన్‌కు కూడా బాగా టైం తీసుకున్నాడు.

కాబట్టి పకడ్బందీగానే ఫైనల్ కట్ రెడీ చేసి ఉంటాడని ఆశించవచ్చు. చిరు కూడా ఆమోద ముద్ర వేశాకే ఫస్ట్ కాపీ రెడీ అయి ఉంటుంది కాబట్టి రన్ టైం పెద్ద సమస్య కాదని అందరూ నమ్ముతున్నట్లే. చరణ్ ఓ కీలక పాత్ర పోషించిన ఈ చిత్రాన్ని నిరంజన్ రెడ్డితో కలిసి మెగా వారి కొణిదెల్ ప్రొడక్షన్సే నిర్మించింది. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే కథానాయికలుగా నటించిన ‘ఆచార్య’లో సోనూ సూద్ విలన్‌గా కనిపించనున్నాడు.