విజయ్ సినిమాకు పరాభవం

గత గురువారం ‘కేజీఎఫ్-2’ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలైంది. ఈ చిత్రాన్ని దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో భారీగా థియేటర్లు దొరికాయి. తెలుగులో, కన్నడలో, హిందీలో దానికి అసలు పోటీయే లేదు. డిమాండుకు తగ్గట్లే బోలెడన్ని థియేటర్లు ఇచ్చారు. అదనపు షోలు కూడా పడ్డాయి. కానీ ఒక్క తమిళనాడులో మాత్రం ఈ చిత్రానికి ఇబ్బందులు తప్పలేదు.

అక్కడ విజయ్ సినిమా ‘బీస్ట్’ కూడా రిలీజవుతుండటంతో ‘కేజీఎఫ్-2’కు కోరుకున్నన్ని థియేటర్లు దక్కలేదు. విజయ్ సినిమా బరిలో ఉందంటే ఆటోమేటిగ్గా మెజారిటీ థియేటర్లు దానికి వెళ్లిపోతాయి. ముందే జరిగిన అగ్రిమెంట్ల ప్రకారం మేజర్ థియేటర్లు దానికే కేటాయించడంతో ‘కేజీఎఫ్-2’కు స్క్రీన్లు, షోలు బాగా తగ్గిపోయాయి. ఐతే ‘బీస్ట్’కు నెగెటివ్ టాక్ రావడంతో కథ మారిపోయింది. ‘కేజీఎఫ్-2’కు ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయింది.

కానీ ముందే జరిగిన అగ్రిమెంట్ల వల్ల వీకెండ్ వరకు ‘బీస్ట్’యే అత్యధిక థియేటర్లలో నడిచింది.కొన్ని చోట్ల మాత్రం ‘బీస్ట్’ థియేటర్లు వెలవెలబోతూ.. ‘కేజీఎఫ్-2’ డిమాండ్ పెరిగిపోవడంతో వీకెండ్లోనే దాని థియేటర్లు దీనికి ఇచ్చేశారు. మల్టీప్లెక్సులు ‘కేజీఎఫ్-2’కు షోలు పెంచాయి. అదే సమయంలో డిమాండ్‌ను తట్టుకోవడానికి మిడ్ నైట్, అర్లీ మార్నింగ్ షోలు షెడ్యూల్ చేశారు. రిలీజైన రెండు మూడు రోజుల తర్వాత అర్ధరాత్రి 1 గంటకు, తెల్లవారుజామున 3-4 గంటల మధ్య షోలు వేయడమంటే మామూలు విషయం కాదు.

వీకెండ్ అయ్యాక ‘బీస్ట్’ స్క్రీన్లు, షోలు మరింతగా తగ్గాయి. ‘కేజీఎఫ్-2’ను రీప్లేస్ చేశారు. దీంతో ఈ సినిమా వసూళ్లు ఒక్కసారిగా పెరిగిపోయాయి. సోమవారం చెన్నై సిటీలో ‘కేజీఎఫ్-2’కు 65 లక్షల దాకా వసూళ్లు వస్తే.. ‘బీస్ట్’కు అందులో సగం, అంటే రూ.36 లక్షలే వసూలయ్యాయి. తమిళనాడు అంతటా ఇదే ట్రెండ్. సోమవారం ‘కేజీఎఫ్-2’ మొత్తం వసూళ్లలో ‘బీస్ట్’కు సగం కూడా రాని పరిస్థితి. దీంతో ఒక అనువాద చిత్రం ముందు నిలవలేని స్టార్ డమ్ అంటూ విజయ్‌ను యాంటీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఆటాడుకుంటున్నారు. ఇందులో ఎక్కువగా అజిత్ ఫ్యాన్స్ ఉన్నారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.